Updated : 15/11/2021 04:26 IST

Amit Shah: మాదకద్రవ్యాలను నియంత్రించండి

పోక్సో నేరాలను ఉపేక్షించొద్దు
సీఎంలకు అమిత్‌షా సూచన
భవిష్యత్‌ సమావేశాల్లో మాతృ భాషలో మాట్లాడే వీలు
దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశంలో కేంద్ర హోం మంత్రి

దక్షిణాది ప్రాంతీయ మండలి సమావేశం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాతో లక్షద్వీప్‌ పరిపాలనాధికారి ప్రఫుల్‌ పటేల్‌, పుదుచ్చేరి, ఏపీ, కర్ణాటక సీఎంలు రంగసామి, జగన్‌, బొమ్మై, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై, అండమాన్‌ నికోబార్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ జోషి తదితరులు

ఈనాడు- అమరావతి, ఈనాడు డిజిటల్‌ -తిరుపతి: మాదకద్రవ్యాల వినియోగం జీవితాల్ని నాశనం చేస్తోందని, యువతను నిర్వీర్యం చేస్తోందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు ముఖ్యమంత్రులు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. మహిళలు, బాలలపై జరిగే నేరాల దర్యాప్తును 60 రోజుల్లోగా పూర్తి చేయాలన్న నిబంధనను కచ్చితంగా పాటించాలని చెప్పారు. పోక్సో చట్టం కింద నమోదైన కేసుల పరిష్కారానికి ప్రాధాన్యమివ్వాలని, ఆ నేరాలను ఏ మాత్రమూ ఉపేక్షించొద్దని నిర్దేశించారు.  తిరుపతిలోని తాజ్‌ హోటల్‌లో ఆదివారం జరిగిన 29వ దక్షిణాది ప్రాంతీయ మండలి (సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌) సమావేశంలో అమిత్‌షా అధ్యక్షోపన్యాసం చేశారు. ‘ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్‌ యాక్ట్‌ల సవరణ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఆ సవరణల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి నివేదికలివ్వాలి. విచారణల వేగవంతానికి రాష్ట్రాలు ‘డైరెక్టరేట్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌’ స్వతంత్ర వ్యవస్థను ఏర్పాటు చేయాలి’ అని సూచించారు. ప్రధాని మోదీ చొరవతో ఇప్పటికే జాతీయ ఫోరెన్సిక్‌ సైన్స్‌ విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం ఏర్పాటయ్యాయని అమిత్‌షా చెప్పారు. ప్రతి రాష్ట్రం కనీసం ఒక్క ఫోరెన్సిక్‌ సైన్స్‌ కళాశాలనైనా ఏర్పాటు చేయాలని, వాటిలో సిలబస్‌ స్థానిక భాషలో ఉండాలన్నారు.  

ప్రాంతీయ మండలి సమావేశం సందర్భంగా భోజనాలు చేస్తున్న రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్‌ అలీ, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, పుదుచ్చేరి సీఎం రంగసామి

దేశాన్ని సుసంపన్నం చేసిన దక్షిణాది
దక్షిణ భారత రాష్ట్రాల ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు, భాషలు దేశాన్ని సుసంపన్నం చేశాయని అమిత్‌ షా కొనియాడారు. ‘గత ఏడేళ్లలో 18 జోనల్‌ కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహించి  అనేక సమస్యలను పరిష్కరించాం. ఈ సమావేశాల వల్ల సభ్యుల మధ్య అత్యున్నత స్థాయిలో చర్చలకు అవకాశం ఏర్పడుతుంది. ఇకపై వివిధ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని భావిస్తున్నాం. దేశంలోని అన్ని ప్రాంతీయ భాషలను కేంద్రం గౌరవిస్తుంది. అందుకే ఈ సమావేశం వివరాలను ఆయా రాష్ట్రాల భాషల్లోకి అనువదించేలా కౌన్సిల్‌ ఏర్పాట్లు చేసింది. భవిష్యత్తులో జరిగే సమావేశాల్లో ప్రతినిధులు సొంత భాషలో మాట్లాడే అవకాశం ఉండాలన్నది కేంద్రం ఆకాంక్ష.  

నవంబరు 15న జన్‌ జాతీయ గౌరవ్‌ దివస్‌
స్వతంత్ర ఉద్యమం, దేశాభివృద్ధిలో గిరిజన తెగల పాత్రను గుర్తు చేసుకుంటూ ఏటా నవంబరు 15న ‘జన్‌ జాతీయ గౌరవ్‌ దివస్‌’గా పాటించాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించాలి.  

కొవిడ్‌ నియంత్రణతో సత్తా చాటాం
*  కొవిడ్‌ను నియంత్రించే స్థాయి భారత్‌కు లేదని అంతా భావించారు. అయితే.. ప్రధాని మోదీ నాయకత్వంలో మహమ్మారి నివారణలో మన సత్తా చాటాం. కరోనా నియంత్రణకు 111 కోట్ల డోసుల టీకాలు వేయడం సమాఖ్యవాద విజయానికి ఉదాహరణ అని అమిత్‌షా వివరించారు.  

*  ‘జోనల్‌ కౌన్సిల్‌ సమావేశాలకు సంబంధించి 51 పెండింగ్‌ అంశాలకు గాను ఈ భేటీ సందర్భంగా 40 పరిష్కరించాం’ అని అమిత్‌షా ట్వీట్‌ చేశారు.  

Read latest Top News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని