Subhash Chandra Bose: బ్రిటిష్‌ను బోల్తా కొట్టించిన బోస్‌

కాంగ్రెస్‌లో అంతఃకలహాలతో విసిగి వేసారిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విదేశీ సాయంతో ఆంగ్లేయులపై సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తెలివిగా తెల్లవారి కళ్లుగప్పి గృహనిర్బంధం నుంచి తప్పించుకోవడమే కాకుండా..

Updated : 18 Jan 2022 04:21 IST

కాంగ్రెస్‌లో అంతఃకలహాలతో విసిగి వేసారిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ విదేశీ సాయంతో ఆంగ్లేయులపై సాయుధ పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం తెలివిగా తెల్లవారి కళ్లుగప్పి గృహనిర్బంధం నుంచి తప్పించుకోవడమే కాకుండా.. ఏకంగా దేశం సరిహద్దులు దాటేశారు.

కాంగ్రెస్‌ అధ్యక్ష పదవిని వదులుకున్న తర్వాత దాదాపు ఒంటరైనా.. తన పోరాటాన్ని ఆపలేదు నేతాజీ. విదేశీ సాయం లేనిదే బ్రిటిష్‌వారిని పారదోలలేమని నమ్మిన ఆయన- రష్యా, జర్మనీ, జపాన్‌ల సహకారం కోసం ప్రణాళికలు సిద్ధం చేశారు. సరైన సమయం కోసం వేచిచూస్తున్నారంతే!  మరోవైపు నేతాజీ విప్లవ పంథా గురించి తెలిసిన బ్రిటిష్‌ ప్రభుత్వం ఆయన్ను ఎప్పుడెప్పుడు అరెస్టు చేయాలా అని ఎదురుచూస్తోంది. కోల్‌కతాలో నిరసన ప్రదర్శనను సాకుగా చూపుతూ... 1940 జులై 2న ఆయన్ను అరెస్టు చేసి జైల్లో వేశారు. రాజద్రోహ నేరం కూడా మోపారు. విచారణ మొదలవటానికి ముందే.. వ్యూహాత్మకంగా బోస్‌ జైల్లో ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. దీక్ష వారం రోజులు దాటి... ఆయన ఆరోగ్యం పాడవుతుండటంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. బోస్‌కేమైనా అయితే బెంగాల్‌తో పాటు యావద్దేశం ఎలా ప్రతిస్పందిస్తుందో తెలిసిన ఆంగ్లేయులు డిసెంబరులో ఆయన్ను జైలు నుంచి విడుదల చేశారు. కోల్‌కతాలోని తన ఇంట్లోనే గృహనిర్బంధంలో ఉంచారు.  

ఆ మాత్రం అవకాశం చాలనుకున్న నేతాజీ తన వ్యూహాలకు మరింత పదును పెట్టారు. తొలుత అఫ్గానిస్థాన్‌కు, తర్వాత సోవియట్‌ యూనియన్‌ మీదుగా జర్మనీకి వెళ్లాలనుకున్నారు. దీనికి అనుగుణంగా పావులు కదపటం మొదలెట్టారు. తప్పించుకోవటానికి కొద్దివారాల ముందు నుంచే... సందర్శకులను, బంధువులను కలవటం ఆపేశారు. ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడుతున్నారనే భావన కలిగించారు. బ్రిటిష్‌ గార్డులను చూడటానికీ ఇష్టపడేవారు కాదు. తన అన్న కుమారుడు శిశిర్‌ బోస్‌ ఒక్కడే రోజూ వచ్చి రాత్రిదాకా ఆయనతో గడిపి వెళ్లేవాడు. ఇదే సమయంలో.. తన రూపు రేఖలు మారేలా గడ్డం పెంచారు. చాలారోజులుగా చూడనివారు ఒక్కసారిగా చూస్తే ఈయన బోస్‌ అని గుర్తుపట్టలేనంతగా! ఇలా... శిశిర్‌ తప్ప మరెవరినీ కలవకుండా ఏకాంతంగా ఉండటం నిత్యకృత్యమైంది. ఆంగ్లేయ భద్రతాసిబ్బంది కూడా దీనికి అలవాటు పడ్డారు.

అలా అంతా రోజువారీ తంతులో మునిగితేలుతున్న వేళ... 1941 జనవరి 16న - తప్పించుకునే ప్రణాళికకు బోస్‌ ముహూర్తం పెట్టేశారు. నల్లని జర్మన్‌ వాండరర్‌ కారులో శిశిర్‌ రాత్రిపూట బోస్‌ను కలిసేందుకు ఎప్పటిలాగే వచ్చారు. ముస్లింలు ధరించే టోపీ, దుస్తులతో బోస్‌ సిద్ధంగా ఉన్నారు. రాత్రి ఒకటిన్నర సమయంలో బయటకు వచ్చిన శిశిర్‌.. డ్రైవర్‌ సీటులో కూర్చొని తనవైపు డోర్‌ను సెంట్రీలకు వినిపించేలా బలంగా వేశారు. ఒకే డోర్‌ శబ్దం వినిపించిన సెంట్రీలు ఒక్కరే ఎక్కారనుకొని నిర్లిప్తంగా ఉండిపోయారు. వెనక డోర్‌లోంచి బోస్‌ సైతం నక్కి కూర్చున్నారనే సంగతి గుర్తించలేదు. డోర్‌ను పూర్తిగా వేయకుండా కాస్త దూరం వెళ్లేదాకా అలాగే పట్టుకొని కూర్చున్న బోస్‌ ఇక బయటపడ్డాం అనుకున్నాక ఊపిరిపీల్చుకున్నారు. దారిలో తమ బంధువు అశోక్‌నాథ్‌ బోస్‌ ఇంట భోజనం చేసి... బిహార్‌లోని గోమోహ్‌ (ప్రస్తుతం ఝార్ఖండ్‌లో ఉంది) రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ కల్కా మెయిల్‌ రైలు ఎక్కారు బోస్‌. స్టేషన్‌లో పోలీసులున్నా... మారిన వేషంలో ఆయన్ను గుర్తించలేకపోయారు. రైల్లో పెషావర్‌ చేరుకున్న నేతాజీ సులభంగానే అఫ్గానిస్థాన్‌లోకి ప్రవేశించారు. అక్కడి నుంచి సోవియట్‌కు వెళ్లాలనేది ఆలోచన. కానీ అఫ్గాన్‌లో తనకు పాష్టో భాష రాకపోవటంతో పట్టుబడే పరిస్థితి ఎదురైంది. దీంతో... అప్పటికప్పుడు స్థానిక గిరిజనుడిగా వేషం మార్చి.. బధిరుడిగా నటించి బయటపడ్డారు. ఆగాఖాన్‌-3 అనుచరులు ఆయన సోవియట్‌లోకి అడుగుపెట్టడానికి సహకరించారని చెబుతుంటారు.

బ్రిటిష్‌వారి నిఘా గురించి తెలిసిన బోస్‌... తన ఆనుపానులు మార్చేశారు. ఇటాలియన్‌ పాస్‌పోర్టుతో మాస్కోకు ప్రయాణించారు. అక్కడి నుంచి రోమ్‌కు వెళ్లి... 1941 ఏప్రిల్‌లో జర్మనీ చేరుకున్నారు. 1942లో జర్మన్‌ నియంత హిట్లర్‌ను కలుసుకున్నారు. బ్రిటిష్‌పై దుష్ప్రచారానికే తనను హిట్లర్‌ వాడుకోవటానికి ప్రయత్నిస్తున్నారని గుర్తించి... జపాన్‌కు వెళ్లారు. ఆ దేశ సైన్యం సాయంతో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ను ఏర్పాటుచేశారు. ఆంగ్లేయులపై దాడులు ఆరంభించారు. అండమాన్‌ నికోబార్‌ దీవులు కొంతకాలం నేతాజీ ఫౌజ్‌ స్వాధీనంలోకి వచ్చాయి. రెండో ప్రపంచ యుద్ధానంతరం మళ్లీ చేజారాయి. ఆంగ్లేయులను ఫౌజ్‌ ప్రత్యక్షంగా ఓడించకున్నా... వారిలో భయాన్ని నింపి, పరోక్షంగా వారి నిష్క్రమణకు కీలకమైందనేది వాస్తవం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని