Warangal: ఆరోగ్య ఓరుగల్లు

వరంగల్‌ను ఆరోగ్య నగరం(హెల్త్‌ సిటీ)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలోనే అతి పెద్ద, అత్యాధునిక వసతులతో కూడిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1,100 కోట్లను మంజూరు

Updated : 05 Dec 2021 05:16 IST

అత్యాధునిక వసతులతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి

15 ఎకరాల్లో, 24 అంతస్తులతో నిర్మాణం

2,000 పడకలు.. 500 మందికిపైగా వైద్యులు

రూ.1,100 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం

భవనం నమూనాను విడుదల చేసిన మంత్రి హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: వరంగల్‌ను ఆరోగ్య నగరం(హెల్త్‌ సిటీ)గా తీర్చిదిద్దేందుకు రాష్ట్రంలోనే అతి పెద్ద, అత్యాధునిక వసతులతో కూడిన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి రూ.1,100 కోట్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వు(జీవో నం.158) జారీ చేసింది. 15 ఎకరాల్లో, 24 అంతస్తులతో రెండు వేల పడకల సామర్థ్యంతో నిర్మించేందుకు అనుమతించింది. ఆసుపత్రి భవన నిర్మాణ నమూనాను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు శనివారం విడుదల చేశారు.

వరంగల్‌ను ఆరోగ్య నగరంగా మారుస్తామని సీఎం ఇటీవల ప్రకటించారు. పేదలకు కార్పొరేట్‌ స్థాయి వైద్యసేవలు అందించేందుకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాలని ఆయన నిర్ణయించారు. వరంగల్‌లోని పాత సెంట్రల్‌ జైలు స్థలాన్ని దీనికి కేటాయించారు. ఆసుపత్రి నిర్మాణానికి జూన్‌ 21న ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు. నిర్మాణంలో భాగంగా సివిల్‌ పనులకు రూ.509 కోట్లు, మంచినీరు, పారిశుద్ధ్యం కోసం రూ.20.36 కోట్లు, మెకానికల్‌, ఎలక్ట్రిసిటీ, ప్లంబింగ్‌ పనుల కోసం రూ.182.18 కోట్లు, వైద్య పరికరాల కోసం రూ.105 కోట్లు, అనుబంధ పనుల కోసం రూ.54.28 కోట్లు, ఇతర పనుల కోసం రూ.229.18 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించింది.


ఇవీ ప్రత్యేకతలు

* ఆసుపత్రిలో మొత్తం 2,000 పడకలు, 36 విభాగాలుంటాయి. 500 మందికి పైగా వైద్యులు, వేయి మందికి పైగా నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది సేవలందిస్తారు. మొత్తం పడకల్లో 1,200 జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఈఎన్‌టీ, డెర్మటాలజీ, ఆర్థోపెడిక్స్‌ విభాగాలకు కేటాయిస్తారు. మరో 800 పడకల్లో అంకాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, పీడియాట్రిక్‌ సర్జరీ, గ్యాస్ట్రో ఎంటరాలజీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌, యూరాలజీ, నెఫ్రాలజీ వంటి సూపర్‌ స్పెషాలిటీ విభాగాల సేవలందిస్తారు. ప్రాంగణంలో వైద్య, దంత కళాశాలలను ప్రారంభిస్తారు.

* కిడ్నీ, కాలేయం వంటి అవయవాల మార్పిడికి సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేస్తారు.

* కీమోథెరపీ, రేడియేషన్‌ సౌకర్యాలతో అత్యాధునిక క్యాన్సర్‌ కేంద్రం ఏర్పాటవుతుంది.

* రోగులకు, వారి సహాయకులకు ప్రత్యేక సౌకర్యాలుంటాయి. వైద్యులు, విద్యార్థులు, సిబ్బంది వసతి సౌకర్యం కల్పిస్తారు.

* అత్యవసర పరిస్థితుల్లో రోగులను హెలికాప్టర్‌లో తరలించేందుకు వీలుగా ఆసుపత్రి వద్ద హెలిప్యాడ్‌ నిర్మిస్తారు.


పేదలకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందుతాయి

- హరీశ్‌రావు

‘‘సీఎం కేసీఆర్‌ సమర్థ నాయకత్వంలో వరంగల్‌ను ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దాలన్న కల సాకారమవుతోంది. రూ.1,100 కోట్లతో సకల వసతులతో సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరగనుంది. దీంతో పేదలకు పూర్తిస్థాయి వైద్యసేవలు అందుతాయి’’ అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆసుపత్రి నిర్మాణానికి నిధుల మంజూరుపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. సీఎం కేసీఆర్‌కు, మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని