YSRTP: షర్మిల పార్టీ ఆవిర్భావం నేడు

తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ ఆవిర్భవిస్తోంది. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు మీద ఆయన తనయ షర్మిల దీనిని నెలకొల్పుతున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ)గా నామకరణం చేశారు.

Updated : 08 Jul 2021 10:51 IST

  రాయదుర్గంలో జెండా ఆవిష్కరణ..  ఎజెండా ప్రకటన
  హాజరుకానున్న తల్లి విజయమ్మ,  భర్త అనిల్‌
ఈనాడు - హైదరాబాద్‌

తెలంగాణ రాజకీయ యవనికపై మరో కొత్త పార్టీ ఆవిర్భవిస్తోంది. దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి పేరు మీద ఆయన తనయ షర్మిల దీనిని నెలకొల్పుతున్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి తెలంగాణ పార్టీ (వైఎస్‌ఆర్‌టీపీ)గా నామకరణం చేశారు. పేరును, జెండాను, ఎజెండాను గురువారం సాయంత్రం ప్రకటించనున్నారు. ముందుగా ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయలో తండ్రి సమాధి వద్ద పార్టీ జెండాను ఉంచి ప్రార్థనలు చేస్తారు. కడప నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం బేగంపేటకు చేరుకుంటారు. తెలంగాణ సంప్రదాయాలకు అనుగుణంగా సాంస్కృతిక ప్రదర్శనలతో కళాకారులు ఆమెకు స్వాగతం పలికేందుకు శ్రేణులు ఏర్పాట్లు చేశాయి. ‘‘ఆమె పంజాగుట్టలోని వైఎస్‌ విగ్రహానికి పూలమాల వేసి సాయంత్రానికి రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్‌ కేంద్రానికి చేరుకుంటారు. ఐదు గంటలకు వేదికపైన తెలంగాణ అమరవీరుల స్తూపానికి, వైఎస్‌ విగ్రహానికి నివాళి అర్పించి పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పార్టీ స్థాపన లక్ష్యాలు, ఎజెండాపై గంటా 15 నిమిషాల పాటు ప్రసంగిస్తారు. తల్లి వైఎస్‌ విజయమ్మ, భర్త అనిల్‌కుమార్‌, కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇప్పటి వరకు కోర్‌ టీంగా నిలిచిన కొండా రాఘవరెడ్డి, పిట్ట రాంరెడ్డి, తూడి దేవేందర్‌రెడ్డి తదితరులు సభావేదికపై నుంచి జెండా ఆవిష్కరణలో పాలుపంచుకోనున్నారు. భారీ ఎత్తున సభావేదిక నిర్మిస్తున్నాం. ఇతర ఏర్పాట్లూ చేస్తున్నాం. కార్యక్రమాన్ని యూట్యూబ్‌లోనూ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాం’’ అని శ్రేణులు వివరించాయి.

 రాజన్న పాలనే లక్ష్యమంటూ...

రాజన్న సంక్షేమ పాలన తీసుకు రావడమే ధ్యేయమంటూ తెలంగాణ రాజకీయాల్లో షర్మిల రంగ ప్రవేశం చేశారు. గతంలో మరో ప్రజా ప్రస్థానం పేరుతో నిర్వహించిన పాదయాత్రలో తోడుగా నిలిచిన నాయకులు, అభిమానులు ఆమెకు వెన్నంటిరాగా ఫిబ్రవరి 9న ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. పది ఉమ్మడి జిల్లాలను ప్రాతిపదికగా చేసుకొని ఏప్రిల్‌ 9న చివరగా ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించారు. అనంతరం మూడు రోజుల పాటు నిరుద్యోగ దీక్ష చేపట్టారు. వివిధ కారణాలతో ఇటీవల పలువురు ఆప్తుల్ని కోల్పోగా బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం చేశారు.

ప్రజలు సంతోషంగా లేనందుకే పార్టీ స్థాపన: కొండా

ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నాక కూడా తెలంగాణలో ప్రజలు సంతోషంగా లేరని షర్మిల ప్రధాన అనుచరుడు కొండా రాఘవరెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమం నిర్వహించనున్న జేఆర్సీ కన్వెన్షన్‌లో ఆయన ప్రసార మాధ్యమాలతో మాట్లాడారు. షర్మిలతోనే విభిన్న వర్గాలకు అన్ని విధాలా న్యాయం జరుగుతుందని తెలిపారు. అంతకు ముందు జెండాకు చిలుకూరు బాలాజీ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని