Updated : 19 Jan 2021 13:26 IST

నందిగ్రామ్‌ నుంచి పోటీచేస్తా

సువేందుకు మమత సవాల్‌
50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తానన్న సువేందు అధికారి
వేడెక్కిన బెంగాల్‌ రాజకీయం
నందిగ్రామ్‌(పశ్చిమబెంగాల్‌):

రానున్న శాసనసభ ఎన్నికల్లో నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తానని పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించడంతో బెంగాల్‌ రాజకీయం వేడెక్కింది. ఇటీవల తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి భాజపాలోకి చేరిన సువేందు అధికారిది నందిగ్రామ్‌ నియోజకవర్గమే. 2016 శాసనసభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున ఆయన ఇక్కడి నుంచి పోటీ చేసి నెగ్గారు. సోమవారం నందిగ్రామ్‌లో జరిగిన బహిరంగసభలో మమత మాట్లాడుతూ నందిగ్రామ్‌, భవానీపుర్‌ల నుంచి పోటీ చేస్తానని, ఒక వేళ భవానీపుర్‌లో పోటీ సాధ్యం కాకపోతే అక్కడ మరోకరిని బరిలోకి దింపుతామని ప్రకటించారు. ప్రస్తుతం మమత దక్షిణ కోల్‌కతాలోని భవానీపుర్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.‘‘శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని ఎప్పుడూ నందిగ్రామ్‌ నుంచే ప్రారంభిస్తాను. ఇది నాకు కలిసొచ్చిన ప్రాంతం. ఈ సారి నేనిక్కడ నుంచే పోటీ చేయాలనుకుంటున్నా’’ అని ఆమె చెప్పారు. ర్యాలీలో సువేందుపై కూడా మమతా బెనర్జీ పరోక్షంగా విమర్శలు చేశారు. ‘‘పార్టీ వీడిన వారికి శుభాకాంక్షలు, వారు దేశానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అయితే అవ్వనీయండి కానీ.. నేను బతికుండగా నా రాష్ట్రాన్ని భాజపాకు అమ్మేందుకు అనుమతించను’’ అని ఆమె పేర్కొన్నారు. ఏప్రిల్‌-మేలో పశ్చిమబెంగాల్‌ శాసనసభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
నందిగ్రామే ఎందుకంటే..
బెంగాల్‌లో నందిగ్రామ్‌ రాజకీయంగా సునిశిత నియోజకవర్గం. 34 ఏళ్ల లెఫ్ట్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం అధికారం కోల్పోవడంతో ఈ ప్రాంతం కీలక పాత్ర పోషించింది. ప్రత్యేక ఆర్థిక మండలి కోసం అప్పటి లెఫ్ట్‌ఫ్రంట్‌ ప్రభుత్వం చేపట్టిన బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా నందిగ్రామ్‌లో పెద్దయెత్తున ఆందోళన జరిగింది. ఆ ఉద్యమం రాజకీయంగా మమత నేతృత్వంలోని తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీకి కలిసొచ్చింది. 2011లో అధికారంలోకి రావడానికి తోడ్పడింది. ఆ సమయంలో సువేందు అధికారి ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. నందీగ్రామ్‌.. ఆయనకు కంచుకోట. ఈ ప్రాంతంలో సువేందుకు చాలా పట్టుంది. అలాంటి నేత తాజాగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో భాజపాలోకి చేరారు. అందుకే మమత వ్యూహాత్మకంగా నందిగ్రామ్‌ను ఎంచుకుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సవాల్‌ స్వీకరిస్తున్నా: సువేందు
మమతా బెనర్జీ సవాల్‌ను స్వీకరిస్తున్నట్లు సువేందు అధికారి తెలిపారు.‘‘ఒకవేళ మా పార్టీ నన్ను నందిగ్రామ్‌లో అభ్యర్థిగా నిలబెడితే ఆమెను 50 వేల ఓట్ల తేడాతో ఓడిస్తా. లేకపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటా’’ అని సువేందు ప్రకటించారు  
ఓడిపోతానన్న భయంతోనే..
భవానీపుర్‌లో ఓడిపోతానన్న భయంతోనే మమతా బెనర్జీ అకస్మాత్తుగా నందిగ్రామ్‌ నుంచి పోటీ చేస్తానని ప్రకటించారని పశ్చిమబెంగాల్‌ భాజపా అధ్యక్షుడు దిలీప్‌ ఘోష్‌ అన్నారు. నందీగ్రామ్‌లో కూడా మమతా ఓడడం ఖాయమని తెలిపారు.
టీఎంసీ కార్యకర్త హత్య
జల్పాయ్‌గుఢీ: ఒకవైపు తృణమూల్‌, భాజపా మధ్య మాటల యుద్ధం జరుగుతుంటే మరోవైపు రాజకీయ హింస చెలరేగుతోంది. జల్పాయ్‌గుఢీ జిల్లాలో తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ (టీఎంసీ) కార్యకర్త ఒకరు హత్యకు గురైనట్లు సోమవారం పోలీసులు తెలిపారు. పార్టీ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వస్తుండగా అతనిపై దాడి జరిగింది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే ఈ హత్య చేశారని టీఎంసీ ఆరోపించింది. టీఎంసీలో అంతర్గత తగాదాలే హత్యకు దారితీశాయని భాజపా పేర్కొంది.


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని