గేటుకు గ్రీజే పెట్టలేరు.. మూడు రాజధానులు కడతారంట

ఏపీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగి గ్రామాలు కొట్టుకుపోయాయన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వ్యాఖ్యలపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. ఈ ప్రాజెక్టు గేటుకు గ్రీజు వేయలేని, ఏడాదైనా మరమ్మతు చేయించలేని.. ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతారంట అని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన

Published : 05 Dec 2021 04:31 IST

 షెకావత్‌ వ్యాఖ్యలపై ఏపీ సీఎం సమాధానం చెప్పాలి

తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌

ఈనాడు-అమరావతి: ఏపీ ప్రభుత్వ వైఫల్యం కారణంగానే అన్నమయ్య ప్రాజెక్టు కట్ట తెగి గ్రామాలు కొట్టుకుపోయాయన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ వ్యాఖ్యలపై సీఎం జగన్‌ సమాధానం చెప్పాలని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండు చేశారు. ఈ ప్రాజెక్టు గేటుకు గ్రీజు వేయలేని, ఏడాదైనా మరమ్మతు చేయించలేని.. ఈ ముఖ్యమంత్రి మూడు రాజధానులు కడతారంట అని ఎద్దేవా చేశారు. మంగళగిరిలోని తెదేపా జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఒకరిని చంపితే హత్యాయత్నం కేసు పెడతారు.. అన్నమయ్య ప్రాజెక్టులో 45 మందిని బలిగొంటే మీ మీద కేసుల్లేవా? చట్టపరమైన చర్యల్లేవా?’ అని నిలదీశారు. ‘సీఎం చేతగానితనం కారణంగానే వరదల వల్ల రూ.6వేల కోట్ల ఆస్తి నష్టం, 62 మంది ప్రాణాలు పోయాయి. ఇందుకు ఆయనే బాధ్యుడు. ఆయన్ను రాజీనామా చేయమన్నా.. పదవికి అర్హత లేదన్నా అవి తక్కువ మాటలే...’ అని మండిపడ్డారు. సమగ్ర న్యాయవిచారణ చేయించాలని, మృతుల కుటుంబాలకు రూ.కోటి చొప్పున చెల్లించాలని, ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండు చేశారు.  అన్నమయ్య ప్రాజెక్టుకు సంబంధించి కేంద్ర మంత్రి షెకావత్‌ వివరాలు వెల్లడిస్తే...‘ముంచేసింది కాక.. ఎదురుదాడికి దిగుతారా? ఆయనకు ఏమీ తెలియదంటారా...’ అని ఏపీ జలవనరులశాఖ మంత్రి అనిల్‌కుమార్‌పై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో తుమ్మలగుంట చెరువును స్టేడియంగా మార్చడంతో వరద ప్రవాహం పద్మావతి విశ్వవిద్యాలయం, రైల్వేస్టేషన్‌ దిగువ భాగాలను ముంచెత్తిందని చెప్పారు. 

వీసీని చూస్తే జాలేస్తోంది

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయ ఉపకులపతిని చూస్తే జాలేస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. ‘ఎందుకు ఆ పదవి? రాజీనామా చేసి ఇంటికి పోయిండొచ్చు.. వేధింపులతో కళ్లనీళ్లు పెట్టుకునే పరిస్థితి ఉంది. ఆయనో అసమర్థ వ్యక్తిగా మిగిలిపోతారు’ అని చెప్పారు. ‘ఉద్యోగులు దాచుకున్న వాటితో పాటు విద్యార్థుల సొమ్ము తదితరాలు కలిపి రూ.400 కోట్లు ఉంటే వాటిపైనా కన్నేస్తారా?’ అని నిలదీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని