గెలుపే లక్ష్యంగా ‘మిషన్‌-19’

రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 19 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఏడు చోట్ల భాజపా గెలిచే అవకాశం ఉందని, మరో మూడు చోట్ల నువ్వా నేనా అన్నట్లు ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఆయా స్థానాల్లో మంత్రులు,

Published : 29 Dec 2021 04:45 IST

ఎస్సీ నియోజకవర్గాల్లో భాజపా కార్యాచరణ ప్రణాళిక
నియోజకవర్గ సమస్యలపై ఎమ్మెల్యేలను నిలదీయాలి
పార్టీ శ్రేణులకు సంజయ్‌ పిలుపు

హైదరాబాద్‌లో నిర్వహించిన వర్క్‌షాపులో ప్రసంగిస్తున్న భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 19 ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గాల్లో ఏడు చోట్ల భాజపా గెలిచే అవకాశం ఉందని, మరో మూడు చోట్ల నువ్వా నేనా అన్నట్లు ఉందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. ఆయా స్థానాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్రమైన వ్యతిరేకత ఉందన్నారు.వారి అవినీతి, అక్రమాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయాలని సూచించారు. ఎస్సీ నియోజకవర్గాల్లో గెలుపే లక్ష్యంగా ‘మిషన్‌-19’ పేరుతో కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. అందుకు అనుసరించాల్సిన వ్యూహంపై హైదరాబాద్‌లో నిర్వహించిన వర్క్‌షాపులో ఆయన మాట్లాడారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా పార్టీ విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. చేపట్టాల్సిన కార్యక్రమాల ప్రణాళికను ఈ సందర్భంగా ప్రకటించారు. 19 నియోజకవర్గాలకు పరిశీలకులను నియమిస్తున్నామని తెలిపారు. వారు జనవరి 5 నుంచి 25 వరకు ఆయా నియోజకవర్గాల్లో పర్యటిస్తారన్నారు. ‘30లోగా మండల, పోలింగ్‌ బూత్‌, పన్నా ప్రముఖ్‌ల కమిటీలు నియామకం చేపట్టాలి. ఫిబ్రవరి 7 లోపు నియోజకవర్గ కార్యాలయాలు, మార్చి 1లోపు మండల కేంద్రాల్లో కార్యాలయాలు ప్రారంభించాలి. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ జయంతిని ఘనంగా నిర్వహించాలి. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. దళితబంధు పథకాన్ని దళిత కుటుంబాలన్నింటికీ వర్తింపజేయాలని కోరుతూ సంతకాల సేకరణ, పోస్టు కార్డు ఉద్యమం, మండల కార్యాలయాల వద్ద ధర్నా, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు చేయాలి. స్థానిక శాసనసభ్యులు, తెరాస నాయకులను ఘెరావ్‌ చేయాలి. వారి ఇళ్ల ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టాలి’ అని సంజయ్‌ సూచించారు. కార్యక్రమానికి హాజరైన సీనియర్‌ నాయకులు అధ్యక్షుడికి పలు సలహాలు ఇచ్చారు. దళిత అదాలత్‌ కార్యక్రమం నిర్వహించాలని, భీమా జ్యోతి కార్యక్రమాన్ని తీసుకొచ్చి తెరాస నాయకుల వైఫల్యాలను ప్రశ్నించాలని సూచించారు. భాజపా నేతలు ఇంద్రసేనారెడ్డి, చంద్రశేఖర్‌, విజయరామారావు, వివేక్‌, రవీంద్రనాయక్‌, ఎస్‌.కుమార్‌, గుజ్జుల ప్రేమేందర్‌ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, బంగారు శ్రుతి పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts