పశ్చిమ యూపీలో జాట్ల మొగ్గు ఎవరివైపు?

జాట్లు ఎటువైపు ఉంటే అధికారం అటువైపు ఉంటుందని ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో తరచుగా వినిపించే మాట. పశ్చిమ యూపీలోని 110 నియోజకవర్గాల్లో దాదాపు 90 సీట్లలో గెలుపోటములను ఈ వర్గం ప్రభావితం

Updated : 20 Jan 2022 05:36 IST

రైతు ఉద్యమం ప్రభావం ఏ మేరకు!!

మేరఠ్‌: జాట్లు ఎటువైపు ఉంటే అధికారం అటువైపు ఉంటుందని ఉత్తర్‌ప్రదేశ్‌ రాజకీయ వర్గాల్లో తరచుగా వినిపించే మాట. పశ్చిమ యూపీలోని 110 నియోజకవర్గాల్లో దాదాపు 90 సీట్లలో గెలుపోటములను ఈ వర్గం ప్రభావితం చేయగలదు. రాష్ట్రంలో జరిగిన గత ఎన్నికల్లో వీరు భారతీయ జనతా పార్టీవైపు మొగ్గు చూపారు. ఫలితంగా ఈ ప్రాంతంలో కాషాయ పార్టీ ఘన విజయాలు సాధించింది. అయితే.. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన రైతు ఉద్యమంలో జాట్లు..ఈ  ప్రాంతంలోని మరో బలమైన వర్గమైన గుర్జర్లు కలిసి పోరాడిన తీరు.. పశ్చిమ యూపీ ఎన్నికల ముఖ చిత్రాన్ని మార్చేశాయి.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని 403 అసెంబ్లీ సీట్లకు ఏడు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. తొలి రెండు దశల్లో ఎన్నికలు జరిగే 113 నియోజకవర్గాలు పశ్చిమ యూపీకి చెందినవే. జాట్లు, గుర్జర్లు ఇక్కడ ప్రధాన ఓటర్లు. వీరే విజయాన్ని నిర్ణయిస్తారని చెప్పలేం కానీ.. ఈ వర్గాల ఓట్లు చాలా ప్రధానమైనవి. యూపీలో జాట్లు 4 శాతం మేర ఉంటారు. ఒక్క పశ్చిమ యూపీలోనే వీరి జనాభా 18%. యూపీలో ముస్లింలు కూడా దాదాపు 18 శాతమే. ఈ సారి జాట్లు, ముస్లింలు కలిస్తే.. పశ్చిమ యూపీలో సమీకరణాలు భాజపాకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంటుంది. ఖైరానా, షహారన్‌పుర్‌, బిజనౌర్‌, గాజియాబాద్‌, ముజఫర్‌నగర్‌, మేరఠ్‌, మురాదాబాద్‌, సంబల్‌, అమ్రోహ్‌, బులంద్‌ షహర్‌, గౌతమబుద్ధ నగర్‌, హాథ్రాస్‌, అలీగఢ్‌, నగీనా, ఫతేపుర్‌ సిక్రీ, ఫిరోజాబాద్‌ ప్రాంతాల్లో జాట్లు గెలుపోటములు ప్రభావితం చేసే వర్గం.

2013 ఘర్షణలతో భాజపా హవా

గత రెండు లోక్‌సభ ఎన్నికల్లోనూ జాట్లు భారతీయ జనతా పార్టీ వైపే మొగ్గు చూపారు. 2014 ఎన్నికల్లో 71 శాతం జాట్లు కమలానికి ఓటేశారు. 2019 ఎన్నికలు వచ్చేసరికి అది 91 శాతానికి పెరిగింది. దీనికి కారణం.. 2013లో ముజఫర్‌నగర్‌లో జరిగిన మతపరమైన అల్లర్లేనని భాజపా రాజకీయ ప్రత్యర్థుల ఆరోపణ. నిజానికి ఈ ఘర్షణలు పశ్చిమ యూపీ రాజకీయ సమీకరణాలను సమూలంగా మార్చేశాయి. జాట్లకు, ముస్లింలకు మధ్య దూరాన్ని పెంచాయి. దీంతో బహుజన్‌ సమాజ్‌ పార్టీ దళిత్‌-ముస్లిం, ఆర్‌ఎల్‌డీ జాట్‌-ముస్లిం, సమాజ్‌వాదీ పార్టీ ముస్లిం-వెనకబడిన కులాల సమీకరణాలు దెబ్బతిన్నాయి. భాజపా లబ్ధి పొందింది.

ఆర్‌ఎల్‌డీ ప్రయత్నాలు ఫలించేనా..

జాట్లలో రాష్ట్రీయ లోక్‌దళ్‌(ఆర్‌ఎల్‌డీ)కు మంచి పట్టుంది. పశ్చిమ యూపీలో ఆ పార్టీ గతంలో ఎన్నో విజయాలను నమోదు చేసింది. 2013 ముజఫర్‌నగర్‌ మత ఘర్షణల తర్వాత.. రేసులో వెనుకబడింది. అయితే ఈసారి ఎన్నికల్లో గత వైభవం సాధిస్తామన్న నమ్మకంతో ఆ పార్టీ అధినేత జయంత్‌ చౌధరీ ఉన్నారు. ఆర్‌ఎల్‌డీ.. ఈ సారి సమాజ్‌వాదీతో కలిసి బరిలోకి దిగుతోంది. ప్రముఖ జాట్‌ నాయకులైన తన తాత ఛౌధరీ చరణ్‌సింగ్‌, నాన్న అజిత్‌ సింగ్‌ వారసత్వాన్ని కొనసాగించాలని జయంత్‌ భావిస్తున్నారు. మరోవైపు భాజపా మాత్రం అభివృద్ధి మంత్రాన్ని నమ్ముకుంది. యోగి ఆదిత్యనాథ్‌ నాయకత్వంలో గత కొన్నేళ్లలో పశ్చిమ యూపీ ముఖచిత్రాన్ని మార్చేశామని భాజపా చెబుతోంది. అభివృద్ధిని చూసి ప్రజలు తమకు ఓట్లు వేస్తారంటోంది.

రైతు ఉద్యమం ప్రభావమే కీలకమా..!

కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం.. పశ్చిమ యూపీ ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే..ఉద్యమంలో జాట్లు, గుర్జర్లు కీలక పాత్ర పోషించారు. స్వతహాగా వ్యవసాయదారులైన జాట్లు.. రైతుల విషయంలో భాజపా అనుసరించిన వైఖరిపై అసహనంగా ఉన్నారు. దిల్లీ సరిహద్దుల్లో శాంతియుతంగా జరిగిన ఉద్యమాన్ని అణిచివేతకు కేంద్రం కుట్ర పన్నిందని వారు భావిస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే.. రైతు ఉద్యమానికి నాయకత్వం వహించిన ప్రముఖ నాయకులంతా జాట్‌ వర్గానికే చెందిన వారే. వ్యవసాయ చట్టాలను కేంద్రం కూడా వెనక్కి తీసుకున్నా వీరు సంతృప్తిగా లేరు. అదే సమయంలో ఆర్‌ఎల్‌డీ, సమాజ్‌వాదీ పార్టీలు బహిరంగంగా రైతులకు మద్దతు ఇచ్చాయన్న విషయాన్ని ఇక్కడ మరిచిపోకూడదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని