విశాల ఐక్య ఫ్రంట్‌ ఏర్పడాలి

మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు దేశంలో విశాల ఐక్యఫ్రంట్‌ ఏర్పాటు అవసరమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టీకరించారు. ప్రజా ఉద్యమాలను

Published : 24 Jan 2022 04:56 IST

 దానికి లౌకిక శక్తుల తోడ్పాటు కావాలి

ప్రజా ఉద్యమాలతోనే భాజపాను గద్దె దింపగలం

సీపీఐ(ఎం) ప్రతినిధుల సభలో సీతారాం ఏచూరి

ఈనాడు, హైదరాబాద్‌ - తుర్కయంజాల్‌, న్యూస్‌టుడే: మతోన్మాద, విభజన రాజకీయాలకు పాల్పడుతున్న మోదీ నేతృత్వంలోని భాజపా ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు దేశంలో విశాల ఐక్యఫ్రంట్‌ ఏర్పాటు అవసరమని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టీకరించారు. ప్రజా ఉద్యమాలను బలపరచటం ఒక్కటే దీనికి మార్గమన్నారు. అందుకు ముందుగా వామపక్షాల ఐక్యత సాధించాలిని ఆకాంక్షించారు. భాజపాకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధపడుతున్న పార్టీలు, ప్రజస్వామిక, లౌకికశక్తులతో కలిసి నడవాలని సూచించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర మూడో మహాసభల రెండో రోజైన ఆదివారం హైదరాబాద్‌ శివారు తుర్కయంజాల్‌లో జరిగిన ప్రతినిధుల సభను ప్రారంభించాక దిల్లీ నుంచి వర్చువల్‌గా సీతారాం ఏచూరి మాట్లాడారు. దేశంలో ఆరెస్సెస్‌ ఎజెండా అమలే లక్ష్యంగా భాజపా వ్యవహరిస్తోందని పార్టీ గతంలోనే ప్రస్తావించిందన్నారు. అదిప్పుడు నిజమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుత అజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లోనే.. భారత్‌ను హిందూదేశంగా మార్చటమే ధ్యేయమని మోదీ ప్రకటించే అవకాశముందని ఆయన హెచ్చరించారు. ఇందుకోసం రాజ్యాంగ వ్యవస్థలనూ కేంద్రం చెప్పుచేతల్లో పెట్టుకుంటోందని.. ప్రతిపక్ష పార్టీల నేతలపై కేసులు పెట్టి లొంగతీసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేసి.. కార్పొరేట్లకు దోచిపెడుతున్నారని.. పౌర, ప్రజాస్వామిక హక్కులపై దాడులు జరుగుతున్నాయని విమర్శించారు. ఇదే సమయంలో భాజపా చర్యలు, ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమాలు బలపడుతున్నాయని ఏచూరి గుర్తుచేశారు. ఇలాంటి అంశాలన్నింటిపై మహాసభలో సమగ్రంగా చర్చించి భావి కార్యాచరణకు సిద్ధం కావాలని ఏచూరి పిలుపునిచ్చారు.  అనంతరం సభలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వీరయ్య బలపరిచారు. అనంతరం అమరులకు మహాసభ నివాళి అర్పించింది.

కాషాయ అడ్డాగా మారకుండా అడ్డుకోవాలి

గతంలో వామపక్షాలకు నెలవుగా కొనసాగిన తెలంగాణ రాష్ట్రం.. ప్రస్తుతం కాషాయ అడ్డాగా మారే దశలో ఉంది. అదే జరిగితే పార్టీ పూర్వవైభవం సాధించడం కలగానే మిగులుతుంది. అలా జరగకూడదంటే ఆర్థిక పోరాటాలే కాక.. సైద్ధాంతిక, సామాజిక, సాంస్కృతిక భావజాలంతో ఎదుర్కోవాలి. ఈ క్రమంలో భాజపాకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో కేసీఆర్‌ సహా మద్దతిచ్చే అందరినీ కలుపుకొని వెళతాం. అలాగని వచ్చే ఎన్నికల్లో తెరాసతో కలిసి పనిచేస్తామని కాదు.

- తమ్మినేని వీరభద్రం, రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ(ఎం) తెలంగాణ

తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం తగువులు

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల మధ్య తగువులు పెట్టి వనరులను దోచుకుంటోంది. కేంద్రం జోక్యం లేకుండా నదీజలాల సమస్యను, ఇతర అంశాలను చర్చల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించుకోవాలి.

- వి.శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్‌

కమ్యూనిస్టులు ఒక్కటవ్వాలి

భాజపా ప్రభుత్వం అధికారంలో కొనసాగితే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ఉండదు. తెలంగాణలో తెరాస అధికారంలో వచ్చాక ప్రజాస్వామ్య పాలన సాగడం లేదు. సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. బడుగు, బలహీన వర్గాల పక్షాన పోరాడేందుకు వామపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉంది.

- చాడ వెంకట్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని