రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయి

తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) ఆరోపించింది. పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమీక్ష చేయాలని గవర్నర్‌ తమిళిసైను కోరింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క,

Published : 26 Jan 2022 05:03 IST

పోలీస్‌ శాఖపై సమీక్ష చేయండి
గవర్నర్‌కు కాంగ్రెస్‌ శాసనసభా పక్షం వినతి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: తెలంగాణలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కాంగ్రెస్‌ శాసనసభా పక్షం(సీఎల్పీ) ఆరోపించింది. పోలీసు శాఖపై ప్రత్యేక దృష్టి సారించాలని, సమీక్ష చేయాలని గవర్నర్‌ తమిళిసైను కోరింది. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, జగ్గారెడ్డి, సీతక్క మంగళవారం రాజ్‌భవన్‌లో ఆమెను కలిసి ఐదు పేజీలతో కూడిన వినతిపత్రం సమర్పించింది. అనంతరం భట్టివిక్రమార్క విలేకరులతో మాట్లాడారు. 2014లో తెరాస అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు శాంతి భద్రతలు ఏ విధంగా దెబ్బతిన్నాయో గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ‘‘జనవరి 3న పాల్వంచలో వనమా రాఘవ బాధితుడు రామకృష్ణ కుటుంబం ఆత్మహత్యతో పాటు గతంలో మంథనిలో న్యాయవాద దంపతులు వామనరావు-నాగమణి దారుణ హత్య, నల్గొండలో మున్సిపల్‌ ఛైర్మన్‌ భర్త శ్రీనివాస్‌ హత్య, దిశ అత్యాచారం- హత్య తదితర సంఘటనలను గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లాం. 2021లో క్రైం రేట్‌ పెరిగిందని స్వయంగా డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్షలో తెలిపారు. ఇది ఆ శాఖ వైఫల్యాన్ని తెలియజేస్తుంది. తెరాస ప్రభుత్వంలో పోలీస్‌.. పోలీస్‌లాగా పని చేయడం లేదు. తెరాస నాయకులు చెపితేనే పోలీసులు న్యాయం చేస్తారనే భావన ప్రజలకు కలిగే పరిస్థితి నెలకొంది’’ అని భట్టి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని