ఆయన భాషతో తెలంగాణకు తలవంపులు

ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాడుతున్న భాష చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని... అలాంటి వ్యక్తి సీఎం ఎలా అయ్యారని దేశం ప్రశ్నిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు.

Published : 03 Feb 2022 04:47 IST

బండి సంజయ్‌

ఈనాడు, దిల్లీ; ఈనాడు, హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ వాడుతున్న భాష చూసి తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకుంటోందని... అలాంటి వ్యక్తి సీఎం ఎలా అయ్యారని దేశం ప్రశ్నిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌పై అసభ్యంగా మాట్లాడడం ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్‌కు రాజ్యాంగంతో వచ్చిన ఇబ్బందేమిటో తెలపాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగాన్ని మార్చాలనడం... అంబేడ్కర్‌, దళిత వర్గాన్ని అవమానించడమేనన్నారు. కేసీఆర్‌కు ఏ మాత్రం జ్ఞానం ఉన్నా ముఖ్యమంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహం ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు. రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా భాజపా శ్రేణులు గురువారం ‘భాజపా భీం దీక్ష’ల పేరుతో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు సంజయ్‌ ఆధ్వర్యంలో భాజపా నాయకులు తెలంగాణభవన్‌ ఆవరణలోని అంబేడ్కర్‌ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. మరో కార్యక్రమంలో తెలంగాణలో ఆరోగ్య రంగానికి కేసీఆర్‌ ఏం వెలగబెట్టారని భాజపా రాజ్యసభ సభ్యుడు జి.వి.ఎల్‌.నరసింహారావు దిల్లీలో ప్రశ్నించారు.

రాజ్యాంగంపై కేసీఆర్‌ వ్యాఖ్యలకు నిరసనగా గురువారం ఉదయం రాజ్‌ఘాట్‌లో బండి సంజయ్‌ మౌనదీక్ష చేపట్టాలని నిర్ణయించారు.

అసెంబ్లీలో మెజార్టీ రాకపోయినా కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేయవచ్చంటూ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగంలోని 3వ అధికరణ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ని భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు. ప్రధాని నరేంద్రమోదీపై కేసీఆర్‌ వాడిన భాష జుగుప్సాకరంగా ఉందని మండిపడ్డారు.

రాష్ట్రంపై రూ.నాలుగు లక్షల కోట్ల అప్పుల భారం మోపిన కేసీఆర్‌కు ప్రధానిపై వ్యాఖ్యలు చేసే, భాజపాను విమర్శించే అర్హత లేదని ఆ పార్టీ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని