26 నుంచి ‘మన ఊరు-మన పోరు’

జాతీయ రాజకీయాలంటూ కాంగ్రెస్‌ను దెబ్బతీసేలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భాజపాతో లోపాయికారి ఒప్పందంతో యూపీఏ భాగస్వామ్య పక్షాలతో ఆయన సమావేశాలు ఏర్పాటు చేయడం లాంటి అంశాలపై

Updated : 25 Feb 2022 06:22 IST

స్థానిక సమస్యలపై కాంగ్రెస్‌ బహిరంగసభలు
ప్రజలను చైతన్యపరచాలని శ్రేణులకు రేవంత్‌రెడ్డి పిలుపు

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: జాతీయ రాజకీయాలంటూ కాంగ్రెస్‌ను దెబ్బతీసేలా కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. భాజపాతో లోపాయికారి ఒప్పందంతో యూపీఏ భాగస్వామ్య పక్షాలతో ఆయన సమావేశాలు ఏర్పాటు చేయడం లాంటి అంశాలపై ప్రజలను చైతన్యపరచాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. స్థానిక సమస్యలపై 26 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘మన ఊరు- మన పోరు’ పేరుతో ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలు విజయవంతం చేయాలని కోరారు. రేవంత్‌రెడ్డి అధ్యక్షతన గురువారం దృశ్యమాద్యమం ద్వారా పీసీసీ కార్యవర్గ సమావేశం జరిగింది. ‘మన ఊరు- మన పోరు’లో భాగంగా పరిగి, వేములవాడ, కొల్లాపూర్‌లలో సభల ఏర్పాట్లపై చర్చించారు. త్వరలో ప్రారంభం కానున్న అసెంబ్లీ, పార్లమెంట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాల రూపకల్పన గురించి చర్చించారు. డిజిటల్‌ సభ్యత్వాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికీ¨ రేవంత్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. కేసీఆర్‌ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ.. సామాజిక మాద్యమాల ద్వారా ఎండగట్టాలన్నారు. సింగరేణికి చెందిన ఒడిశాలోని నైనీ కోల్‌మైన్‌ విషయంలో జరుగుతున్న అవినీతిపై కార్మిక సంఘాలతో కలిసి పోరాడాలన్నారు. సమావేశంలో ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్‌ కృష్ణన్‌, నాయకులు మహేశ్వర్‌రెడ్డి,  మధుయాస్కీగౌడ్‌, అంజన్‌కుమార్‌ యాదవ్‌, మహేశ్‌కుమార్‌గౌడ్‌, అజారుద్దీన్‌ పాల్గొన్నారు.

27న నిరుద్యోగ నిరసన దీక్ష

నిరుద్యోగ సమస్యలపై 27న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇందిరాపార్కు వద్ద ఒక రోజు నిరసన దీక్ష చేయనున్నట్లు యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని