Eatala: సింగరేణి ప్రైవేటీకరణయత్నం శుద్ధ అబద్ధం: ఈటల

సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందన్న ప్రచారం శుద్ధ అబద్ధమని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

Published : 14 Mar 2022 08:16 IST

గోదావరిఖని, న్యూస్‌టుడే: సింగరేణి ప్రైవేటీకరణకు కేంద్ర ప్రభుత్వం యత్నిస్తోందన్న ప్రచారం శుద్ధ అబద్ధమని మాజీ మంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ విషప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమన్నారు. సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌(బీఎంఎస్‌) ద్వైవార్షిక మహాసభలను ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం ఈటల మాట్లాడుతూ- తమకు గనులు అవసరం లేదని సింగరేణి యాజమాన్యం తెలిపిన తర్వాతే కేంద్రం వేలం నిర్వహించిందని చెప్పారు. సింగరేణిలో ప్రస్తుతం నడుస్తున్న గనుల్లో బొగ్గు ఉత్పత్తిని ప్రైవేటుకు అప్పగిస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు నిలిపివేయడం లేదని ప్రశ్నించారు. తాడిచెర్ల ఓసీపీని ప్రైవేటువారికి అప్పగిస్తున్న అంశాన్ని  అసెంబ్లీలో ప్రస్తావించానన్నారు. తాడిచెర్ల బ్లాక్‌-1 వెనుక ఎవరున్నారో బయటపెట్టాలన్నారు.  సింగరేణిలో కాంట్రాక్టు కార్మికులు లేరంటున్నారని, ఇటీవల ఏఎల్‌పీ గని ప్రమాదంలో ఒప్పంద కార్మికుడు మృతి చెందిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.  సింగరేణి కోల్‌మైన్స్‌ కార్మిక సంఘ్‌ అధ్యక్షుడు సత్తయ్య అధ్యక్షతన జరిగిన మహాసభలో బీఎంఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, నాయకులు కిషన్‌జీ, మాధవనాయక్‌, రాంరెడ్డి పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని