Congress: 5 రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులపై వేటు

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, గోవా

Updated : 16 Mar 2022 11:00 IST

రాజీనామా కోరిన సోనియా

పార్టీ విభాగాల పునర్‌వ్యవస్థీకరణ దిశగా ముందడుగు

దిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఉత్తర్‌ప్రదేశ్‌, పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, మణిపుర్‌, గోవా పీసీసీల సారథులపై కొరడా ఝళిపించారు. అధ్యక్ష పదవులకు రాజీనామా చేయాల్సిందిగా వారిని ఆదేశించారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ విభాగాలను పునర్‌వ్యవస్థీకరించే ప్రయత్నాల్లో భాగంగా ఆమె ఈ ఆదేశాలు జారీ చేసినట్లు కాంగ్రెస్‌ ప్రధాన అధికార ప్రతినిధి రణదీప్‌ సుర్జేవాలా ట్విటర్‌ వేదికగా మంగళవారం వెల్లడించారు. యూపీలో అజయ్‌కుమార్‌ లల్లూ, పంజాబ్‌లో నవ్‌జోత్‌సింగ్‌ సిద్ధూ, ఉత్తరాఖండ్‌లో గణేశ్‌ గోదియాల్‌, మణిపుర్‌లో ఎన్‌.లోకెన్‌సింగ్‌, గోవాలో గిరీశ చోడంకర్‌ పీసీసీ అధ్యక్షులుగా ఉన్నారు. వీరిలో సిద్ధూ, గోదియాల్‌, లోకెన్‌సింగ్‌ ఆయా రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపించాక పార్టీ పగ్గాలు స్వీకరించారు. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో పార్టీ దారుణ ఓటమి అనంతరం కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ (సీడబ్ల్యూసీ) ఆదివారం సమావేశమై సుదీర్ఘంగా సమాలోచనలు జరిపింది. పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన మార్పులు చేయాల్సిందిగా సోనియాను కోరింది. ఈ నేపథ్యంలో ఆమె తాజా ముందడుగు వేయడం గమనార్హం.

గోదియాల్‌ రాజీనామా

సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేసిన వెంటనే ఉత్తరాఖండ్‌ పీసీసీ అధ్యక్ష పదవి నుంచి గణేశ్‌ గోదియాల్‌ వైదొలిగారు. రాష్ట్రంలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ట్విటర్‌లో వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని