జాతీయ రహదారుల విస్తరణ ఎప్పటికి?

జాతీయ రహదారుల విస్తరణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కోరారు. లోక్‌సభలో బుధవారం రహదారులపై చర్చలో ఆయన మాట్లాడారు. ‘దేశంలోని

Published : 17 Mar 2022 04:56 IST

మీ హయాంలో కిషన్‌రెడ్డికే కొలువు దొరికింది

లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ: జాతీయ రహదారుల విస్తరణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి కోరారు. లోక్‌సభలో బుధవారం రహదారులపై చర్చలో ఆయన మాట్లాడారు. ‘దేశంలోని రహదారుల్లో జాతీయ రహదారులు 2 శాతమే. ఈ రంగంలో ప్రైవేటు పెట్టుబడులను తీసుకురావడంలో కేంద్రం విఫలమైంది. 2023 మార్చి నాటికి దేశంలో 25,000 కి.మీ. మేర జాతీయ రహదారులు నిర్మిస్తామని చెప్పారు. అలా చేయాలంటే రోజుకు 68 కి.మీ. మేర నిర్మించాల్సి ఉండగా కేవలం 37 కి.మీ. చొప్పునే నిర్మిస్తున్నారు. ఇలానే పనులు సాగితే మరో ఏడెనిమిదేళ్లు పడుతుంది’ అని అన్నారు. ‘ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నరేంద్రమోదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ లెక్కన ఇప్పటివరకు 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. అందులో తెలంగాణకు కనీసం 50 లక్షలు రావాలి. కానీ తెలంగాణ నుంచి కిషన్‌రెడ్డికి మంత్రి పదవి మినహా మరెవరికీ ఉద్యోగం రాలేదు. భారత్‌మాల కింద 2022 పూర్తయ్యే నాటికి 34,800 కి.మీ. మేర రహదారులు నిర్మిస్తామన్నారు. ఇప్పటి వరకు 7,375 కి.మీ. మాత్రమే పూర్తయ్యాయి’ అని తెలిపారు. ‘దేశంలో నాలుగు నిమిషాలకో రహదారి ప్రమాదం జరుగుతోంది. ప్రపంచంలోని వాహనాల్లో మన దేశం వాటా ఒక శాతం. ప్రమాదాల శాతం 11. రోడ్డు ప్రమాదాల్లో మృతుల సంఖ్యలో మనదేశానిది మొదటి స్థానం. రోడ్ల నిర్వహణ లేక చనిపోవడం అంటే అవి ప్రభుత్వం చేసిన హత్యలే. రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబం రోడ్డున పడుతుంది. మోదీ తాను టీ అమ్మానని చెబుతారు.. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన కుటుంబాల వారు రైల్వే ఫ్లాట్‌పాంలపై టీ అమ్మాల్సి వస్తుంది. ఆ పరిస్థితి రానివ్వద్దు’ అని కోరారు. ‘తెలంగాణకు హైదరాబాద్‌ రాజధాని.. ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధాని. హైదరాబాద్‌ విజయవాడ రహదారి విస్తరణను ప్రైవేటు వ్యక్తికి అప్పగించారు. మేం చెబుతున్నా కేంద్రం పట్టించుకోవడం లేదు. హైదరాబాద్‌-బెంగళూరు రహదారిని ఎనిమిది వరుసలకు విస్తరించాలి’ అని రేవంత్‌ విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని