YS Sharmila: షర్మిల పాదయాత్రలో కలకలం.. కత్తితో వార్డు సభ్యుడి వీరంగం

భువనగిరి మండలం బొల్లేపల్లిలో శనివారం వైతెపా అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల  మహాపాదయాత్రలో తెరాసకు చెందిన వార్డు సభ్యుడు కత్తితో హల్‌చల్‌ చేయటంతో కలకలం

Updated : 20 Mar 2022 07:01 IST

వైతెపా కార్యకర్తకు గాయాలు

ధర్నాకు దిగిన వైతెపా అధ్యక్షురాలు

భువనగిరి గ్రామీణం, న్యూస్‌టుడే: భువనగిరి మండలం బొల్లేపల్లిలో శనివారం వైతెపా అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల  మహాపాదయాత్రలో తెరాసకు చెందిన వార్డు సభ్యుడు కత్తితో హల్‌చల్‌ చేయటంతో కలకలం రేగింది. తమ పార్టీ కార్యకర్తపై దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు పెట్టాలంటూ షర్మిల ఆందోళనకు దిగడంతో ఉద్రిక్తత తలెత్తింది. యాదాద్రి జిల్లా బీబీనగర్‌ మండలం నుంచి మొదలైన మహాపాదయాత్ర భువనగిరి మండలంలోని రెడ్డినాయక్‌తండా, పచ్చర్లబోడు తండా మీదుగా మధ్యాహ్నం బొల్ల్లేపల్లి గ్రామానికి చేరుకుంది. శివారులోని చెన్నోల్లబావి వద్ద భోజన విరామం తీసుకున్నారు. సాయంత్రం గ్రామంలో ‘షర్మిలక్కతో మాట ముచ్చట’ జరగాల్సి ఉంది. అందుకు కార్యకర్తలు సన్నాహాలు చేస్తుండగా వార్డు సభ్యుడు తాళ్లపల్లి శ్రావణ్‌ మాంసం కత్తితో వీరంగం సృష్టించాడు. యాత్రకు ప్రజలతో వచ్చిన వాహనం టైరును కోశాడు. పీహెచ్‌సీ వద్ద ఫ్లెక్సీ కడుతున్న తాడును శ్రావణ్‌ లాగడంతో వైతెపా కార్యకర్త శివరాజ్‌ మెడకు అది ఉచ్చులా బిగుసుకొని గాయమైంది. బాధితుడు కేకలు వేయడంతో పోలీసులు శ్రావణ్‌ను పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న షర్మిల కార్యకర్తలతో కలసి రాస్తారోకోకు దిగారు. శ్రావణ్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేయాలన్నారు. రాస్తారోకోతో బొల్లేపల్లి-బీబీనగర్‌ మార్గంలో వాహనాల రాకపోకలు స్తంభించాయి. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు ధ్రువీకరించడంతో షర్మిల ఆందోళన విరమించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ.. ‘తెరాస వార్డు సభ్యుడు శ్రవణ్‌ కత్తితో మా కార్యకర్త శివరాజ్‌పై దాడి చేశాడు. కొంచెంలో ప్రాణహాని తప్పింది’ అని తెలిపారు. శ్రవణ్‌ బొల్లేపల్లిలో అల్లర్లకు పాల్పడుతున్నా.. తెరాసకు చెందిన వ్యక్తి కావడంతో ఒక్క కేసూ నమోదు కాలేదని స్థానికులు చెబుతున్నారని పేర్కొన్నారు. తమ యాత్రను అడ్డగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం విఫలయత్నం చేస్తోందని విమర్శించారు. అనంతరం ఆంజనేయ ఆలయం వద్ద ‘షర్మిలక్కతో మాట ముచ్చట’ కార్యక్రమం సాగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని