Sharad Pawar: కాంగ్రెస్‌ లేకుండా భాజపాపై పోరాడలేం: శరద్‌ పవార్‌

‘కేంద్రంలో భాజపా వ్యతిరేక కూటమికి నేను నాయకత్వం వహించలేను. యూపీఏ ఛైర్‌పర్సన్‌ కావాలని కూడా కోరుకోవడం లేదు. భాజపా వ్యతిరేక పోరాటంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను మినహాయించలేం’ అని

Updated : 04 Apr 2022 06:58 IST

యూపీఏ సారథ్యం నాకొద్దు
ఎన్సీపీ అధ్యక్షుడు వ్యాఖ్యలు

పుణె: ‘కేంద్రంలో భాజపా వ్యతిరేక కూటమికి నేను నాయకత్వం వహించలేను. యూపీఏ ఛైర్‌పర్సన్‌ కావాలని కూడా కోరుకోవడం లేదు. భాజపా వ్యతిరేక పోరాటంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారాలంటే ఎట్టిపరిస్థితుల్లోనూ కాంగ్రెస్‌ను మినహాయించలేం’ అని నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు, కేంద్ర మాజీ మంత్రి శరద్‌ పవార్‌ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భాజపాకు వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ కూటమిని బలోపేతం చేసే చర్యలకు తన సహకారం, మద్దతు కొనసాగిస్తానని తెలిపారు. ‘ప్రతిపక్షాలన్నీ ఒకే వేదికపైకి రావాలన్నపుడు కొన్ని నిజాలు విస్మరించలేం. టీఎంసీ పశ్చిమ బెంగాల్‌లో బలీయమైన శక్తి. అదేవిధంగా ఆయా ప్రాంతీయ పార్టీలు కూడా తమ తమ రాష్ట్రాల్లో బలమైన శక్తులే’ అని పవార్‌ వ్యాఖ్యానించారు. ‘కాంగ్రెస్‌ ఇపుడు అధికారంలో లేకపోయినా, అది అఖిల భారత పార్టీ. దేశంలో ఏ గ్రామానికి వెళ్లినా కార్యకర్తలు ఉంటారు. కాబట్టి, భాజపాపై పోరాటంలో విస్తృతమైన స్థాయి ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అనివార్యం’ అని అన్నారు. కాంగ్రెస్‌ బలమైన ప్రతిపక్షంగా ఉండాలంటూ ఇటీవల కేంద్ర మంత్రి గడ్కరీ చేసిన వ్యాఖ్యలపై పవార్‌ స్పందిస్తూ.. ‘దేశంలో ఒకే పార్టీ బలంగా ఉంటే నాయకులు.. రష్యా అధ్యక్షుడు పుతిన్‌లా మారతారు. భారత్‌కు అటువంటి ‘పుతిన్‌’ బెడద లేదనే నేను అనుకొంటా’ అని చెప్పారు. భాజపా పాలనలో ఈడీ సెటిల్మెంట్ల ఏజెన్సీగా మారిందని పవార్‌ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని