ధాన్యంపై పెద్ద కుట్ర

తెరాస ప్రభుత్వం చేస్తున్న వడ్ల రాజకీయం వెనుక మహాకుట్ర ఉందని, ధాన్యం దళారులు, మాఫియాతో సీఎం కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని, తద్వారా రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి ...

Published : 10 Apr 2022 05:12 IST

మాఫియాతో సీఎం కేసీఆర్‌ కుమ్మక్కు

ప్రభుత్వ పెద్దలకు రూ.వందల కోట్ల కమీషన్లు

దళారుల కోసమే కొనుగోలు కేంద్రాలు తెరవలేదు

రైతులకు సంజయ్‌ బహిరంగ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తెరాస ప్రభుత్వం చేస్తున్న వడ్ల రాజకీయం వెనుక మహాకుట్ర ఉందని, ధాన్యం దళారులు, మాఫియాతో సీఎం కేసీఆర్‌ కుమ్మక్కయ్యారని, తద్వారా రైతులు భారీగా నష్టపోయే ప్రమాదం ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ‘కుట్రలో భాగంగానే యాసంగిలో కొనుగోలు కేంద్రాలు మూసివేయించారు. దళారులకు తక్కువ ధరకే రైతులు ధాన్యం అమ్ముకునే పరిస్థితులను సృష్టించారు. ధాన్యం మాఫియాతో కలిసి పెద్ద స్కెచ్‌ వేశారు. ఇందులో ప్రభుత్వ పెద్దలకు రూ.వందల కోట్ల కమీషన్లు ముట్టబోతున్నాయి’ అని ఆరోపించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేందుకు భాజపా చేస్తున్న పోరాటంలో భాగస్వాములు కావాలని కోరుతూ రైతులకు బహిరంగ లేఖ రాశారు. ‘క్వింటా ధాన్యానికి కేంద్రం మద్దతు ధర రూ.1,960. ఐకేపీ కేంద్రాల్ని రాష్ట్రం తెరవకపోవడంతో.. మిల్లర్లు రూ. 1,300-1,660 లోపే కొంటున్నారు. రైతులు క్వింటాకు రూ. 300-660 నష్టపోతున్నారు’ అని సంజయ్‌ పేర్కొన్నారు.

కోటి టన్నులు.. రూ.వందల కోట్ల కమీషన్‌

‘రాష్ట్రంలో యాసంగిలో కోటి టన్నుల ధాన్యం పండింది. మిల్లర్లు మద్దతు ధర కంటే తక్కువకు కొనడం వల్ల రైతులు రూ.వందల కోట్లు నష్టపోతారు. ప్రతి క్వింటాకు రూ.వంద చొప్పున ప్రభుత్వ పెద్దలకు రూ.వందల కోట్ల మేర కమీషన్‌ ఇచ్చేందుకు కొందరు రైస్‌మిల్లర్ల మాఫియా ఒప్పందం చేసుకున్నట్లు తెలిసింది’ అని సంజయ్‌ ఆరోపించారు.

‘ధర దక్కకుంటే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని.. కేసీఆర్‌ సర్కార్‌ కేంద్రంపై తప్పుడు ప్రచారం చేస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పాలకులు రైతులకు బోనస్‌ ఇచ్చి ఆదుకునేవారు. కానీ తెలంగాణ ప్రభుత్వం బోనస్‌ ఇవ్వకపోగా కనీస మద్దతు ధర అందకుండా రైతులకు తీవ్రనష్టం చేస్తోంది’ అని దుయ్యబట్టారు.

అబద్ధాలతో నట్టేట ముంచారు

వరి విషయంలో కేసీఆర్‌ ఆడిన అబద్ధాలకు అంతూపొంతూ లేదని సంజయ్‌ విమర్శించారు. సన్న రకం ధాన్యం మాత్రమే సాగు చేయాలని 2020 అక్టోబరు 31న ప్రకటించారని, రైతు సమితుల ద్వారా క్వింటాకు రూ.150 వరకు ఎక్కువ చెల్లిస్తామంటూ హామీ ఇచ్చారని సంజయ్‌ పేర్కొన్నారు. ప్రగతిభవన్‌లో 2021 సెప్టెంబరు 12న ఉన్నతస్థాయి సమావేశంలో.. వరి వేస్తే ఉరి వేసుకోవడమే అంటూ వ్యాఖ్యానించారని సంజయ్‌ విమర్శించారు. యాసంగిలో వరి వేసిన వారికి ‘రైతుబంధు’ రద్దు చేస్తామంటూ బెదిరించారని ఆయన పేర్కొన్నారు. మళ్లీ 2021 నవంబరు 29న ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ ప్రకటించారని గుర్తుచేశారు. ‘రైతులు వాస్తవాలు గమనించాలి. లేని సమస్యను సృష్టించి రాజకీయం చేస్తున్న కేసీఆర్‌కు బుద్ధిచెప్పాలి. వడ్ల కొనుగోలు విషయంలో కేంద్రం రైతుల పక్షాన ఉంది. రైతులు పండించే ప్రతిగింజను కొనేందుకు సిద్ధంగా ఉంది’ అని సంజయ్‌ ఆ లేఖలో స్పష్టం చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని