రాష్ట్రంలో వికృత పాలన ఊహించలేదు

రాష్ట్రంలో వికృత పాలనను ఊహించలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక కుటుంబం, కొంత మంది పోలీసు....

Published : 19 Apr 2022 05:06 IST

పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో వికృత పాలనను ఊహించలేదని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో ఒక కుటుంబం, కొంత మంది పోలీసు అధికారుల మాఫియా, డబ్బు ప్రభావంతో పాలన నడుస్తోందని ఆరోపించారు. రానున్న రోజుల్లో ప్రజలు తెరాస పార్టీనీ భూస్థాపితం చేయడం ఖాయమన్నారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘తెరాస నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక రామాయంపేటకు చెందిన ఒక కుటుంబం బలైంది. కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కుమారుడి కిరాతకానికి ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసులో దోషులను ఇంతవరకు పట్టుకోలేదు. పోలీసు వ్యవస్థను కేసీఆర్‌ నాశనం చేశారు. తెరాసకు సహకరిస్తున్న వారికే ఎస్పీలుగా పోస్టింగులు ఇస్తున్నారు. రాష్ట్రంలో 20 మంది నాన్‌ ఐపీఎస్‌ అధికారులు జిల్లా ఎస్పీలుగా కొనసాగుతున్నారు.తెరాస నాయకులు రూ.లక్షలు తీసుకుని ఎస్సైల పోస్టింగులకు సిఫార్సు చేస్తున్నారు’’అని ఉత్తమ్‌ ధ్వజమెత్తారు.

కేసీఆర్‌ మంచోడే.. తప్పుచేసిన వారి చెంప పగలగొట్టాలి: జగ్గారెడ్డి
‘‘కేసీఆర్‌ మంచోడే.. కానీ, ఖమ్మం, రామాయంపేట లాంటి ఘటనలపై స్పందించకపోతే ఆయనకే చెడ్డ పేరు వస్తుంది. తెరాస నాయకులు తప్పు చేస్తే.. కుటుంబపెద్దగా కేసీఆర్‌ వారి చెంప పగలగొట్టాలి’’ అని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. సోమవారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పువ్వాడను మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ చేయాలంటూ భాజపా పోరాడాలని, లేనిపక్షంలో భాజపా, తెరాస మధ్య చీకటి ఒప్పందం ఉందని భావించాల్సి వస్తుందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని