Telangana News: కేఏ పాల్‌పై చేయిచేసుకున్న తెరాస నాయకుడు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్లతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌పై ఓ తెరాస నేత చేయి చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జక్కాపూర్‌

Published : 03 May 2022 08:46 IST

పోలీసులతో మాట్లాడుతున్న క్రమంలో దాడి
సిద్దిపేట జిల్లా సరిహద్దులో ఘటన

సిద్దిపేట టౌన్‌, అర్బన్‌, తంగళ్లపల్లి- న్యూస్‌టుడే: రాజన్న సిరిసిల్ల జిల్లాలో వడగళ్లతో నష్టపోయిన రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌పై ఓ తెరాస నేత చేయి చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా జక్కాపూర్‌ వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఇటీవల వడగళ్ల వానతో సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌ గ్రామంలో పలువురు రైతులు పంటలు నష్టపోయారు. వారిని పరామర్శించేందుకు పాల్‌ తన అనుచరులతో కలిసి హైదరాబాద్‌ నుంచి వాహనాల్లో బయల్దేరారు. వారిని మార్గమధ్యంలో సిద్దిపేట జిల్లా జక్కాపూర్‌ వద్ద సిరిసిల్ల పోలీసులు అడ్డుకున్నారు. శాంతిభద్రతల రక్షణ దృష్ట్యా పరామర్శకు రావొద్దని వారించారు. దీంతో కారు దిగిన పాల్‌ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సిరిసిల్ల జిల్లా తెరాస నేతలు అక్కడికి చేరుకున్నారు. తప్పనిసరిగా తాను రైతులను పరామర్శించాల్సిందేనని పోలీసులతో పాల్‌ చెబుతున్న క్రమంలో జిల్లెల్ల గ్రామానికి చెందిన తెరాస నాయకుడు అనిల్‌రెడ్డి.. పాల్‌పై చేయి చేసుకున్నారు. ఎవరూ ఊహించని రీతిలో ఒక్కసారిగా చెంపపై కొట్టడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తెరాస నేతలు, పాల్‌ వర్గీయులు వాగ్వాదానికి దిగారు.  పోలీసుల వైఖరిపై పాల్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కొందరు పోలీసులు తెరాస కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తున్న తనపై తెరాస శ్రేణులు వ్యవహరించిన తీరు సరిగా లేదన్నారు. చిన్నకోడూరు పోలీసులు ఆయన్ను సిద్దిపేట పట్టణానికి తరలించగా అనంతరం ఆయన అక్కడి నుంచి హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఈ ఘటనపై సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల పోలీసులను ‘న్యూస్‌టుడే’ సంప్రదించగా.. తమకు ఫిర్యాదు అందలేదని తెలిపారు.

పాల్‌కు మద్దతుగా రైతుల నిరసన

జక్కాపూర్‌లో వద్ద పాల్‌ను అడ్డుకుని దాడి చేసిన ఘటనపై తంగళ్లపల్లి మండలం బస్వాపూర్‌ గ్రామ రైతులు సోమవారం నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ అప్పులు చేసి పండించిన పంట అకాల వర్షానికి నేలపాలైందని, అధికారులు వచ్చి రాసుకుపోయారే తప్ప.. ఇప్పటి వరకు సాయం చేయలేదని ఆవేదన చెందారు. సహాయం చేయడానికి వచ్చిన కేఏ పాల్‌పై తెరాస నాయకులు దాడి చేయడం బాధాకరమన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని