Sonia Gandhi: సంస్థాగతంగా బలోపేతం... మోదీ సర్కారుపై సమరం

కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హెచ్చరించారు. 2016 నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలను బూచిగా చూపుతూ ప్రజల మధ్య విరోధాలు పెంచి భయాందోళనలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ గతంలో మాదిరిగా క్రియాశీల పాత్ర పోషించాలని ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆశలను నెరవేర్చేలా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని నేతలకు ఆమె సూచించారు.

Updated : 14 May 2022 06:03 IST

ఉదయ్‌పుర్‌ చింతన శిబిరం వేదికపై నుంచి
కాంగ్రెస్‌ శ్రేణులకు సోనియా గాంధీ దిశానిర్దేశం
పార్టీ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని పిలుపు
స్వప్రయోజనాలు పక్కన పెట్టి పని చేయాలని నేతలకు హితవు
దేశ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్నారంటూ భాజపా ప్రభుత్వంపై ధ్వజం

ఈనాడు, దిల్లీ: కేంద్రంలో నరేంద్ర మోదీ పాలన కొనసాగితే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు తలెత్తే ప్రమాదం ఉందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ హెచ్చరించారు. 2016 నుంచి దేశ ఆర్థిక వ్యవస్థ దిగజారి పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మైనారిటీలను బూచిగా చూపుతూ ప్రజల మధ్య విరోధాలు పెంచి భయాందోళనలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ గతంలో మాదిరిగా క్రియాశీల పాత్ర పోషించాలని ప్రజలు కోరుకుంటున్నారని, వారి ఆశలను నెరవేర్చేలా క్షేత్ర స్థాయి నుంచి పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేద్దామని నేతలకు ఆమె సూచించారు. శుక్రవారం మధ్యాహ్నం రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌లో కాంగ్రెస్‌ నవసంకల్ప శిబిరంలో ప్రారంభోపన్యాసం చేస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకూ కాంగ్రెస్‌ పార్టీ... నేతలకు ఎంతో చేసిందని, ఇప్పుడు దాని రుణం తీర్చుకొనే సమయం వచ్చిందని ఉద్బోధించారు. మేధోమథన సదస్సు అనంతరం పార్టీ అంతా ఐక్యంగానే ఉందన్న సందేశం దేశ ప్రజలకు వెళ్లాలని సోనియా గాంధీ సూచించారు. ఆమె తన ప్రసంగాన్ని ఆంగ్లం, హిందీలో కొనసాగించారు. మోదీ ప్రభుత్వ వైఖరిని తూర్పారపడుతూనే పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

‘‘కాంగ్రెస్‌ పార్టీ ముందు గతంలో ఎన్నడూలేని సవాళ్లున్నాయి. ఏ పార్టీకైనా మనుగడ కాపాడుకోవడంతో పాటు ముందడుగు వేయాలంటే ఎప్పటికప్పుడు అంతర్గత పరివర్తన అవసరం. రణనీతిలో మార్పు, సంస్థాగత సంస్కరణ, రోజువారీ పని తీరులో మెరుగుదల అత్యంత ముఖ్యం. మన పునరుత్థానం అందరి సామూహిక ప్రయత్నం ద్వారానే సాధ్యం. కాంగ్రెస్‌పార్టీ సుదీర్ఘ ప్రయాణంలో ఇప్పుడు నిర్వహిస్తున్న శిబిరం ఒక ప్రభావవంతమైన ముందడుగు కావాలి. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ ప్రయోజనాలకు ప్రాధాన్యమివ్వాల్సిన సమయం వచ్చింది. ఇప్పటివరకు పార్టీ అందరికీ చాలా ఇచ్చింది. ఆ రుణం తీర్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. సదస్సులో పాల్గొంటున్న ప్రతినిధులందరూ మనసు విప్పి అభిప్రాయాలు చెప్పండి. వెలుపలికి మాత్రం పార్టీ బలోపేతం, దృఢనిశ్చయత, ఏకత అన్న సందేశం ఒక్కటే వెళ్లాలి. ఎదురైన ఎత్తుపల్లాల గురించి భయపడాల్సిన అవసరం లేదు. సవాళ్లను ఎదుర్కొని పోరాడి గెలుపొందాల్సిన సమయమిది. మన మీద ప్రజలు పెట్టుకున్న ఆశలను విస్మరించకూడదు చింతన శిబిరం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు కొత్త ఆత్మవిశ్వాసం, శక్తి, ఉత్సాహకరమైన ప్రేరణతో వెళ్లాలి’’ అని సోనియాగాంధీ పిలుపునిచ్చారు.

ప్రధాని మోదీపై మాటల దాడి...

* ‘భాజపా ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులను భయపెట్టి వారి పరువుప్రతిష్ఠలపై బురద జల్లుతోంది. విపక్ష నేతలపైకి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పి తప్పుడు కారణాలతో జైళ్లలో పెడుతోంది. ప్రజాస్వామ్యంలో అన్ని వ్యవస్థల స్వతంత్రతను దెబ్బతీస్తున్నారు. చరిత్రను మొత్తం టోకుగా మార్చే ప్రయత్నం జరుగుతోంది.
* స్వాతంత్య్ర సమరయోధులను తక్కువ చేసి చూపే ప్రయత్నం నిరంతరం జరుగుతోంది. జవహర్‌లాల్‌ నెహ్రూ ఈ దేశానికి చేసిన సేవలు, త్యాగాలను కనుమరుగు చేయడానికి, ఆయన ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కుట్రపూరిత వ్యూహం అమలుచేస్తున్నారు. మహాత్మాగాంధీ హంతకులను, వారి భావజాలాన్ని కీర్తిస్తూ రాజ్యాంగం ప్రసాదించిన న్యాయం, సమానత్వం, సౌభ్రాతృత్వం, లౌకికతత్వం అన్న మూలసూత్రాలను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేస్తున్నారు.
* బ్యూరోక్రసీ, కార్పొరేట్‌ సంస్థలు, పౌర సమాజం, మీడియాను భయపెట్టి గుప్పిట్లో ఉంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు.  
* ప్రభుత్వం రగిలిస్తున్న విభేదాలు, విద్వేషాగ్నికి ప్రజలు పెద్ద ఎత్తున మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తోంది.  
* దేశంలోని అత్యధిక మంది ప్రజలు శాంతియుత వాతావరణంలో జీవించాలనుకుంటున్నారు. కానీ భాజపా, దాని అనుబంధ సంస్థలు మాత్రం ప్రజలు విద్వేషాల మధ్య పోట్లాడుకోవాలని కోరుకుంటూ నిరంతరం  రెచ్చగొడుతున్నాయి. సమాజాన్ని విషతుల్యంగా మార్చే ఈ వైరస్‌కు వ్యతిరేకంగా మనం గట్టిగా పోరాడాలి.
* యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి సుస్థిర ఆర్థిక వృద్ధి అవసరం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచేలా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలంటే మనం ఆదాయం పెంచుకోవాలి. కానీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న సామాజిక పరిస్థితులు ఆర్థిక వృద్ధి పునాదులను దెబ్బతీస్తున్నాయి.
* 2016 నవంబరులో ప్రకటించిన పెద్ద నోట్ల రద్దుతో ఆర్థిక వ్యవస్థ తిరోగమనం మొదలైంది. భారీ సంఖ్యలో కుటీర పరిశ్రమలు దెబ్బతిన్నాయి. నిరుద్యోగం ఆందోళనకరంగా పెరిగిపోయింది.
* రైతు సంఘాల పట్టుదల కారణంగా మోదీ ప్రభుత్వం మూడు సాగు చట్టాలను రద్దు చేయాల్సి వచ్చింది. చట్టాల రద్దు సమయంలో ప్రధాని మోదీ రైతులకు ఇచ్చిన హామీలను ఇంతవరకూ అమలు చేయలేదు. పైగా ఈ సంవత్సరం గోధుమ సేకరణ దారుణంగా పడిపోయింది. దీంతో ఆహారభద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
* వంట గ్యాస్‌, వంటనూనె, తిండిగింజలు, పండ్లు, కూరగాయలు, ఎరువులు, పెట్రో ఉత్పత్తుల ధరలు నిరంతరం పెరిగిపోతూ కోట్ల కుటుంబాలపై మోయలేని భారాన్ని మోపాయి.
* ప్రభుత్వరంగ సంస్థలను ఇప్పుడు పగతో ప్రైవేటీకరిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీల ఉద్యోగాల కల్పనకు ఉన్న అవకాశం పూర్తిగా మూసుకుపోతోంది’ అని సోనియా విమర్శలు గుప్పించారు.


ప్రధాని మోదీ, ఆయన మంత్రులు తరచూ చెప్పే గరిష్ఠ పాలన..కనిష్ఠ ప్రభుత్వం అర్థం దేశాన్ని శాశ్వతంగా కుల, మతాల పునరేకీకరణలోకి నెట్టేయడమే. సమాజంలో అంతర్భాగమైన మైనారిటీలను లక్ష్యంగా చేసుకొని దాడులుచేసి ప్రజలు నిరంతరం భయాందోళనలు, అభద్రతలో బతికే వాతావరణాన్ని ఈ ప్రభుత్వం సృష్టిస్తోంది. ఏళ్ల తరబడి వస్తున్న భిన్నత్వంలో ఏకత్వ సూత్రాన్ని ధ్వంసం చేయడమే వీరి విధానం.

-సోనియాగాంధీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని