
PM Modi: శభాష్ బండి.. బాగా పని చేస్తున్నారు: సంజయ్‌కు మోదీ ఫోన్
ఈనాడు, హైదరాబాద్: ప్రధాని మోదీ ఆదివారం మధ్యాహ్నం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఫోన్ చేశారు. ‘పార్టీ కోసం బాగా పనిచేస్తున్నారు. శభాష్ బండి..’ అంటూ ప్రశంసించారు. ప్రజాసంగ్రామ యాత్ర జరిగిన తీరు, తుక్కుగూడ సభ గురించి ఆరా తీసి సంజయ్‌ని అభినందించారు. రెండో విడత యాత్రను శనివారం పూర్తిచేసుకున్న సంజయ్.. సాయిగణేశ్ కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్తుండగా ప్రధాని నుంచి ఫోన్ వచ్చింది. పాదయాత్రలో ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందని ప్రధాని అడిగారు. యాత్రలో పాల్గొన్న కార్యకర్తలకు అభినందనలు తెలపాలని సూచించారు. సంజయ్ మాట్లాడుతూ ‘‘రెండు విడతల్లో కలిపి 770 కిలోమీటర్లు నడిచాను. మీ (మోదీ) స్ఫూర్తితో.. మీ సూచనలతోనే పాదయాత్ర చేపట్టాను. నడిచింది నేనైనా నడిపించింది మీరే.. మీరు చెప్పిన ‘సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్ కా ప్రయాస్’ పాలన రాష్ట్రంలో తెచ్చేందుకు పాదయాత్ర చేస్తున్నా. కేసీఆర్ పాలనపై తెలంగాణ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కేంద్ర పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అమలుచేయట్లేదు. తెలంగాణలోనూ మీలాంటి నీతివంతమైన పాలన కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. అమిత్ షా, జె.పి.నడ్డాల రాకతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది’’ అని పేర్కొన్నారు. ఈ మేరకు వివరాలతో భాజపా ఓ ప్రకటనలో విడుదల చేసింది.
Advertisement