అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లో రుణమాఫీ

రాష్ట్రంలో 12 నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వచ్చిన నెల రోజుల్లోనే రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ అమలు బాధ్యతను పీసీసీ అధ్యక్షుడిగా

Published : 19 May 2022 05:03 IST

 అర్హులకే రైతుబంధు

తెరాస నేతలను తరిమికొట్టే పరిస్థితి వస్తుంది

మీట్‌ ది ప్రెస్‌లో రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో 12 నెలల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, వచ్చిన నెల రోజుల్లోనే రైతులకు రూ.2 లక్షల లోపు రుణాలను మాఫీ చేస్తుందని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి చెప్పారు. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ అమలు బాధ్యతను పీసీసీ అధ్యక్షుడిగా తానే తీసుకుంటానన్నారు. బుధవారం హైదరాబాద్‌లో తెలంగాణ అధ్యయన వేదిక నిర్వహించిన ‘వరంగల్‌ రైతు డిక్లరేషన్‌.. మీట్‌ ది ప్రెస్‌’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో రైతు టాస్క్‌ఫోర్సును ఏర్పాటు చేసి వ్యవసాయరంగ సమస్యలను పరిష్కరిస్తామన్నారు. రైతుబంధు ఎకరాకు రూ.15 వేలు ఇవ్వడంతో పాటు అర్హులకు మాత్రమే అమలు చేస్తామన్నారు. రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లుగా మారిన భూములకు కూడా ప్రభుత్వం రైతుబంధు ఇస్తోందని, కొందరు బెంజ్‌కార్లలో వచ్చి ఈ పథకం డబ్బులు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. ధరణి పోర్టల్‌ను రద్దు చేసి సులభతర రెవెన్యూ విధానాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలో గిరిజనుల భూ సమస్యలను పరిష్కరించడంతో పాటు అటవీ భూముల అంశంలో న్యాయం చేస్తామన్నారు. మానవ హక్కుల కోసం పోరాడుతున్న నేతలపై కేసులు ఎత్తివేస్తామన్నారు. రాజద్రోహ చట్టం ఎత్తివేతపై కాంగ్రెస్‌ పార్టీ జాతీయస్థాయిలో నిర్ణయం తీసుకుంటుందన్నారు. తెరాస ప్రభుత్వమే నిజాం చక్కెర ఫ్యాక్టరీని మూసివేసిందని.. రూ.200 కోట్ల నష్టాన్ని భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంకాలేదన్నారు.

రాష్ట్రాన్ని దివాలా తీయించారు

విభజన సమయంలో రూ.16 వేల కోట్ల మిగులు ఉన్న రాష్ట్రాన్ని ఎనిమిదేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ దివాలా తీయించారని ఆరోపించారు. రూ.68 వేల కోట్ల అప్పును అయిదు లక్షల కోట్లకు పెంచారని పేర్కొన్నారు. ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వలేని స్థితికి తీసుకువచ్చారన్నారు. ప్రస్తుతం తెలంగాణలో శ్రీలంక పరిస్థితి ఉందని.. ప్రజలు అక్కడి ఎంపీలను తరిమికొట్టిన మాదిరే ఇక్కడ తెరాస నేతలను తరిమికొడతారన్నారు. సచివాలయం, ప్రగతిభవన్‌ నిర్మాణం వంటి అనవసర వ్యయాలకు అడ్డుకట్టవేయాల్సి ఉందన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత 8,400 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని..ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. రైతులకు పంటల బీమా ఇవ్వకుండా చనిపోయిన తర్వాత 74 వేలమందికి రైతుబీమా ఇచ్చినట్లు ప్రభుత్వం సంతోషంగా ప్రకటనలు ఇస్తోందన్నారు. సీఎం కేసీఆర్‌ను ఓడించే సత్తా కాంగ్రెస్‌కే ఉందన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలను కాపాడుకోవడం ఎలా అనేది తమకు తెలుసని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ అధ్యయన వేదిక అధ్యక్షుడు వేణుగోపాల్‌రెడ్డి, ప్రధానకార్యదర్శి సాదిక్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని