కాంగ్రెస్‌లోకి నల్లాల ఓదెలు దంపతులు

చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి మంచిర్యాల జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలోని సోనియాగాంధీ నివాసం 10 జన్‌పథ్‌లో

Published : 20 May 2022 05:28 IST

కండువా కప్పి ఆహ్వానించిన ప్రియాంకాగాంధీ

బాల్క సుమన్‌ అరాచకాలతోనే తెరాసను వీడాం: ఓదెలు

ఈనాడు, దిల్లీ: చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు, ఆయన సతీమణి మంచిర్యాల జిల్లా పరిషత్‌ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మి తెరాసను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దిల్లీలోని సోనియాగాంధీ నివాసం 10 జన్‌పథ్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ.. ఓదేలు దంపతులతోపాటు వారి కుమారులు శ్రవణ్‌, సందీప్‌లకు కాంగ్రెస్‌ కండువాలు కప్పి ఆహ్వానించారు. వారికి పార్టీ సభ్యత్వాన్ని ఇచ్చారు. అనంతరం వారిని అభినందించిన ప్రియాంకాగాంధీ ఇక నుంచి మీరు కాంగ్రెస్‌ కుటుంబ సభ్యులేనని, పార్టీలో సీనియర్లకు ఇచ్చే గౌరవమర్యాదలు ఇస్తామని ఓదెలు దంపతులతో అన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ భాగ్యలక్ష్మిని ఆలింగనం చేసుకున్న ప్రియాంకాగాంధీ ఆమెతో కాసేపు మాట్లాడారు. కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కె.సి.వేణుగోపాల్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనరసింహా, బాల్కొండ మాజీ ఎమ్మెల్యే అనిల్‌ తదితరులు పాల్గొన్నారు. చేరికల అనంతరం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వం అవినీతి, నిర్లక్ష్యానికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా బలైందని ఆరోపించారు. ఆ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగు నీరందించేలా తుమ్మిడిహట్టి వద్ద కట్టాల్సిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును కాలగర్భంలో కలిపేశారని విమర్శించారు. వెనకబడ్డ ఆదిలాబాద్‌ అభివృద్ధి కాంగ్రెస్‌తోనే సాధ్యమన్నారు. ఉద్యమకారుడైన ఓదెలు పార్టీలో చేరడం శుభసూచికమన్నారు.

కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు: ఓదెలు
చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అరాచక చర్యలతోనే తాము తెరాసను వీడామని ఓదెలు అన్నారు. తన ఇంటిపై పోలీసుల నిఘా పెట్టారని, సెల్‌ఫోన్లు ట్యాప్‌ చేస్తున్నారనే విషయాన్ని కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందించకపోవడంతో మనస్తాపం చెంది కుటుంబసభ్యులతో కలిసి తెరాసకు రాజీనామా చేసినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ నాయకులు ఇప్పుడు తెరాసలో కనిపించడం లేదన్నారు. మూడుసార్లు గెలిచిన తనకు 2018లో తెరాస టికెట్‌ ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. తెరాసలో తమకు న్యాయం జరగలేదని, పదవి ఇచ్చి ఎలాంటి పని చేయనీయకుండా రెండేళ్లు ఇంట్లో కూర్చోబెట్టారని జడ్పీ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే సుమన్‌ బెదిరింపులకు దిగారని ఆరోపించారు. 

సీఎం మాటలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం: ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
గాంధీభవన్‌, న్యూస్‌టుడే: గ్రామ పంచాయతీలకు నేరుగా కేంద్ర ప్రభుత్వమే నిధులిచ్చే విధానాన్ని తప్పుపడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని పీసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఆయన గురువారం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామ పంచాయతీలు బలపడాలని నేరుగా నిధులు ఇచ్చే విధానాన్ని రాజీవ్‌గాంధీ తీసుకొచ్చారని చెప్పారు. ఈ విధానం గత 30 సంవత్సరాలుగా అమలులో ఉందన్నారు. కేసీఆర్‌ వ్యాఖ్యలను సర్పంచ్‌లు, ఎంపీపీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ఖండించాలన్నారు. సమావేశంలో మల్లు రవి, కోదండరెడ్డి పాల్గొన్నారు.

దేశం కోసం, ధర్మం కోసం మరోసారి గ్యాస్‌ ధరల పెంపు: రేవంత్‌రెడ్డి
గాంధీభవన్‌, న్యూస్‌టుడే: దేశం కోసం, ధర్మం కోసం కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్‌ మరోసారి గ్యాస్‌ ధరలు పెంచిందని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. గ్యాస్‌ ధరల పెంపుపై ఆయన గురువారం ట్విటర్‌ వేదికగా స్పందించారు. ధరల పెంపు భారాన్ని మోయలేక గొంతు విప్పి ప్రశ్నిస్తే దేశ ద్రోహులు, ధర్మం తప్పినవారవుతారని భాజపా వాట్సప్‌ యూనివర్సిటీ సర్టిఫై చేస్తుందని మండిపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని