రాష్ట్రాలపై కేంద్రప్రభుత్వం వివక్ష

జాతీయ ఆర్థిక సంపద, రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల ఆదాయ పంపిణీలో భారీగా కోతలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసమానతలు, వివక్ష చూపుతోందని కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి

Published : 20 May 2022 05:36 IST

హక్కుల కోసం పోరాడుతున్న కేసీఆర్‌

కేరళ ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: జాతీయ ఆర్థిక సంపద, రాష్ట్రాలకు రావాల్సిన పన్నుల ఆదాయ పంపిణీలో భారీగా కోతలు విధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసమానతలు, వివక్ష చూపుతోందని కేరళ రాష్ట్ర ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.  సంపదనంతా తన చేతుల్లో పెట్టుకుని రాష్ట్రాలకు మొండిచేయి చూపుతోందన్నారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రాల హక్కుల కోసం పోరాడుతున్నారన్నారు. గురువారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సందర్భంగా 37వ స్మారకోపన్యాస సభను నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన బాలగోపాల్‌.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎమ్మెల్యే నంద్యాల నర్సింహారెడ్డి తదితరులతో కలిసి సుందరయ్య చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఆర్థిక రంగంతో పాటు సాంస్కృతిక రంగంపై కేంద్రం దాడి చేస్తోందన్నారు. హోంమంత్రి అమిత్‌షా ఇటీవల బెంగళూరులో హిందీ భాషను తప్పనిసరి చేస్తామనడం దుర్మార్గమని మండిపడ్డారు. జీఎస్టీ అమల్లోకి వచ్చాక పన్ను ఆదాయంలో కేంద్రం సగం, రాష్ట్రాలకు సగం కేటాయిస్తూ నిధుల కొరతను సృష్టిస్తోందన్నారు. ఫలితంగా రాష్ట్రాలకు వేలకోట్ల నష్టం వాటిల్లుతోందని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రాష్ట్రాలు 3.5 శాతం మించకుండా అప్పు తెచ్చుకోవద్దని ఆంక్షలు విధించిన కేంద్రం తాను మాత్రం 6 శాతానికి పైగా అప్పులు తెచ్చుకోవడం ఏమిటని ప్రశ్నించారు. సెస్‌, సర్‌ఛార్జీల విషయంలోనూ 7శాతం ఉన్న పన్నులను 21శాతం పెంచారన్నారు. ఈ సెస్‌ల విధానం ఆపత్కాలం, యుద్ధం సమయంలో మాత్రమే అమలు చేసుకునే విధానం ఉన్నప్పటికీ కేంద్రం ఇష్టారీతిన అమలు చేస్తోందన్నారు. ఫలితంగా కేరళ, తమిళనాడు, కర్ణాటక, రెండు తెలుగు రాష్ట్రాలు ఆర్థికంగా కుదేలయ్యాయన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే శ్రీలంక, ఉక్రెయిన్‌, రష్యా, అమెరికా తరహాలో మనం కూడా సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయమని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని