గ్రామాలకు నేరుగా నిధులిస్తే కేసీఆర్‌కు ఇబ్బందేంటి: సంజయ్‌

కేంద్రం ఇస్తున్న నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. రాజ్యాంగం స్ఫూర్తి మేరకు పంచాయతీలకు కేంద్రం నేరుగా

Published : 20 May 2022 05:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: కేంద్రం ఇస్తున్న నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. రాజ్యాంగం స్ఫూర్తి మేరకు పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులిస్తుంటే ముఖ్యమంత్రికి ఉన్న ఇబ్బందేంటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కేంద్రంపై సీఎం చేసిన విమర్శలపై సంజయ్‌ స్పందిస్తూ గురువారం ప్రకటన విడుదల చేశారు. ‘‘పంచాయతీలకు కేంద్రం నేరుగా నిధులివ్వడాన్ని కేసీఆర్‌ చిల్లర వ్యవహారంగా పేర్కొనడం దురదృష్టకరం. విద్య, వైద్యం సహా 29 అంశాలను గ్రామాలకే బదలాయించాలని రాజ్యాంగం స్పష్టంగా చెబుతున్నా.. పంచాయతీల అధికారాల్ని రాష్ట్ర ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుంది. వివిధ పథకాల లబ్ధిదారుల ఎంపిక గ్రామసభల ద్వారానే జరగాలని రాజ్యాంగం స్పష్టంచేస్తున్నా ఎమ్మెల్యేలకు పెత్తనమిచ్చి పంచాయతీలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన కేసీఆర్‌ది చిల్లర బుద్ధి కాక ఏమనాలి? అభివృద్ధిపనులకు బిల్లులురాక సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కూలీలుగా, వాచ్‌మెన్లుగా, పనిచేస్తున్నారు. కేంద్ర నిధుల్ని ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది. కమీషన్ల కోసం ట్రాక్టర్లు కొంటోంది. ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులివ్వడం లేదు. కాళేశ్వరం, మిషన్‌ భగీరథ, కాకతీయల పేరుతో రూ.వేల కోట్ల కమీషన్లు దండుకుని రాష్ట్రాన్ని దివాలా తీయించి అప్పులకుప్పగా మార్చారు. జాతీయ పంచాయతీరాజ్‌ దినోత్సవం సందర్భంగా ప్రధాని కశ్మీర్‌లోని కుగ్రామానికి వెళ్తే.. కేసీఆర్‌ ఫాంహౌస్‌కే పరిమితమయ్యారు. గ్రామపంచాయతీలంటే కేసీఆర్‌కు ఏమాత్రం గౌరవం లేదు’’ అని ఆయన విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని