నేటి నుంచి కాంగ్రెస్‌ రైతు రచ్చబండ

 రాష్ట్ర కాంగ్రెస్‌ శనివారం నుంచి రైతు రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే రచ్చబండ లక్ష్యం. తెలంగాణ ఉద్యమనేత ఆచార్య జయశంకర్‌ స్వగ్రామమైన

Published : 21 May 2022 05:13 IST

తొలిరోజు ఆచార్య జయశంకర్‌ స్వగ్రామంలో కార్యక్రమం
హాజరుకానున్న రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌:  రాష్ట్ర కాంగ్రెస్‌ శనివారం నుంచి రైతు రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నదే రచ్చబండ లక్ష్యం. తెలంగాణ ఉద్యమనేత ఆచార్య జయశంకర్‌ స్వగ్రామమైన హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో నిర్వహించే రచ్చబండలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాల్గొననున్నారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ వర్ధంతి రోజైన మే21(శనివారం)న ప్రారంభించి జూన్‌ 21 వరకు నెల రోజులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. మొత్తం 400 మంది నేతలు పాల్గొనేలా ప్రణాళిక రూపొందించారు. ప్రతి నాయకుడు 30-40 గ్రామాల్లో రైతు డిక్లరేషన్‌ గురించి ప్రచారం చేయనున్నారు. మొదటి రోజు కాంగ్రెస్‌ ముఖ్యనాయకులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రముఖుల గ్రామాల్లో నిర్వహించే రచ్చబండలో పాల్గొననున్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల రైతుబంధు, పోడు భూములపై గిరిజనులకు హక్కులు, పసుపుబోర్డు ఏర్పాటు, వరి, ప్రధాన పంటలకు మద్దతు ధరలు, ధరణి పోర్టల్‌ రద్దు, ఉపాధిహామీ పథకంతో వ్యవసాయం అనుసంధానం సహా వివిధ అంశాలతో కూడిన వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ను ప్రజలకు వివరించనున్నారు.

తరుగు దోపిడీకి అడ్డుకట్టవేయండి  

రాష్ట్రంలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయడంతో పాటు తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీకి అడ్డుకట్ట వేయాలని  సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ను కిసాన్‌ కాంగ్రెస్‌ కోరింది. కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి శుక్రవారం సీఎస్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. 500 బస్తాల ధాన్యానికి కొన్నిచోట్ల 30 బస్తాలను తగ్గించి రాస్తున్నారని, తూకం సమయంలోనేే బస్తాకు మూడు నాలుగు కిలోలు తగ్గిస్తున్నారని వివరించారు.  

వెయ్యిమంది రైతులకే పరిహారం

రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఇప్పటి దాకా  వెయ్యిమంది రైతుల కుటుంబాలకే రూ.6 లక్షలు చొప్పున సాయం అందిందని ఏఐసీసీ అధికారప్రతినిధి దాసోజు శ్రవణ్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించి 45 రోజులైనా 40% కూడా కొనలేదని విమర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని