జయశంకర్‌ సార్‌ ఊరిపై విద్వేషమా!

తెలంగాణ ఉద్యమానికి దశ, దిశ చూపిన ఆచార్య జయశంకర్‌ సార్‌ ఊరు అక్కంపేటలో అభివృద్ధి మచ్చుకైనా లేదని, పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ గ్రామానికి రెవెన్యూ గ్రామ హోదా

Published : 23 May 2022 04:33 IST

ఆయన పేరుతో స్మృతివనం నిర్మించాలి
సీఎం కేసీఆర్‌కు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమానికి దశ, దిశ చూపిన ఆచార్య జయశంకర్‌ సార్‌ ఊరు అక్కంపేటలో అభివృద్ధి మచ్చుకైనా లేదని, పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ గ్రామానికి రెవెన్యూ గ్రామ హోదా కూడా ఇవ్వకపోవడం విచారకరమని, ఆ పెద్దమనిషంటే సీఎం మనసులో విద్వేషం, వ్యతిరేక భావం ఏదో ఉందని అర్థమవుతోందన్నారు. అక్కంపేట, వరంగల్‌ రింగ్‌ రోడ్డు సమస్యలను ప్రస్తావిస్తూ రేవంత్‌రెడ్డి ఆదివారం సీఎంకు లేఖ రాశారు. ‘ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి ఎనిమిదేళ్లవుతున్నా జయశంకర్‌ సార్‌ స్వగ్రామం వెనుకబడే ఉంది. ఆ ఊరికి మిషన్‌ భగీరథ నీళ్లు కూడా రావడం లేదు. గ్రామంలో సార్‌ పేరిట స్మృతి వనం నిర్మించాలి. వరంగల్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు (ఓఆర్‌ఆర్‌) ప్రాజెక్టు కోసం కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా) చేపడుతున్న ల్యాండ్‌ పూలింగ్‌ పచ్చని పొలాల్లో చిచ్చుపెడుతోంది. ల్యాండ్‌ పూలింగ్‌ను వెనక్కి తీసుకుంటున్నట్లు కింది స్థాయి నాయకులు చేస్తున్న ప్రకటనలు వారిలో విశ్వాసం నింపడం లేదు’ అని లేఖలో పేర్కొన్నారు.  

నిఖత్‌ జరీన్‌కు రూ.5లక్షల పారితోషికం

ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌ షిప్‌లో స్వర్ణ పతకం గెలిచిన నిఖత్‌ జరీన్‌కు రూ.5 లక్షల పారితోషికాన్ని ప్రకటిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి ట్విటర్‌ ద్వారా వెల్లడించారు తెలంగాణ ప్రభుత్వం పీవీ సింధు, సైనా, సానియా మీర్జాలకు ఇచ్చినట్లే నిఖత్‌కు కూడా పారితోషికం ఇవ్వాలని కోరారు.


వ్యవసాయాన్ని పండగ చేసిన కాంగ్రెస్‌

బొంరాస్‌పేట, కొడంగల్‌, దౌల్తాబాద్‌, న్యూస్‌టుడే: అన్నదాతలకు 24 గంటలు ఉచిత విద్యుత్‌, రుణమాఫీ, ధాన్యానికి మద్దతు ధర అందించి అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయాన్ని కాంగ్రెస్‌ పార్టీ పండగ చేసిందని రేవంత్‌ అన్నారు. ఆదివారం వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట మండలంలో తుంకిమెట్ల, కొడంగల్‌ మండలంలో అంగడిరైచూర్‌, దౌల్తాబాద్‌ మండలంలోని చంద్రకల్‌ గ్రామాల్లో జరిగిన ‘రైతు రచ్చబండ’లో ఆయన పాల్గొని మాట్లాడారు. తుంకింమెట్లలో మొలకెత్తిన వరి ధాన్యాన్ని చూపించి రైతుల కష్టాలను వివరించారు.


రుణం మాఫీ చేయకుంటే సొంత పార్టీపైనే పోరాటం

కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

జహీరాబాద్‌ అర్బన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక ఏక కాలంలో రుణమాఫీ చేసి తీరుతామని, లేకపోతే పదవికి రాజీనామా చేసి సొంత పార్టీపైనే పోరాటం చేస్తామని పీసీసీ స్టార్‌ క్యాంపెయినర్‌ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌ మండలం అల్గోల్‌లో ఆదివారం నిర్వహించిన రచ్చబండలో పాల్గొని ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ మంత్రి గీతారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని