Published : 25 May 2022 04:47 IST

రేవంత్‌ను జైలుకు పంపిస్తా

అడుగడుగునా నన్ను బెదిరించారు
రాహుల్‌గాంధీనీ బ్లాక్‌మెయిల్‌ చేస్తారు
మంత్రి మల్లారెడ్డి ధ్వజం

ఈనాడు, హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అడుగడుగునా తనను బ్లాక్‌మెయిల్‌చేసి.. బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేశారని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆరోపించారు. ఇద్దరం తెదేపాలో ఉన్న సమయంలోనూ తనను వదల్లేదని, ఎంపీగా గెలిచిన తర్వాతా ఆపలేదని పేర్కొన్నారు. రేవంత్‌ రేపు రాహుల్‌ గాంధీని కూడా బ్లాక్‌మెయిల్‌ చేస్తారని చెప్పారు. తాను పాలు అమ్మి, కష్టపడి ఆస్తులు సంపాదించానని, మరి రేవంత్‌ ఏ పని చేసి ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు. తాను విద్యాసంస్థల కోసం చట్టబద్ధంగా భూములను కొనుగోలు చేయగా... ఇప్పుడు రేవంత్‌ అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. చట్టపరంగా ఆయనను జైలుకు పంపిస్తానని మంత్రి హెచ్చరించారు. రేవంత్‌ కుమార్తె పెళ్లికి తానే డబ్బులు ఇచ్చానని, ఆ విశ్వాసం కూడా అతనిలో లేదని చెప్పారు. అది నిజం కాదని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా రేవంత్‌ ప్రమాణం చేస్తారా? అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం తెరాస శాసనసభాపక్ష కార్యాలయంలో ఆయన ఎమ్మెల్యే వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజులతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘రేవంత్‌ ఏ పార్టీలో ఉంటే అది నాశనమే. ఆయన ఎక్కడా ఎక్కువకాలం పని చేయరు. రేపో మాపో భాజపాలో చేరినా ఆశ్చర్యం లేదు. రేవంత్‌ది రచ్చబండ కాదు. సినీ ఫక్కీ రాజకీయం. అప్పుడే సీఎం అయిపోయినట్లు మాట్లాడుతున్నారు. సీఎం కాదు కదా.. కనీసం అటెండర్‌ కూడా కాలేరు. ఆయన బండారం బయటపెడతాం’’ అని మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని కులాల వారికి న్యాయం చేస్తున్నారని, 2024లో ప్రాంతీయ పార్టీలతో కలిసి ఆయన దేశాన్ని పాలించడం ఖాయమని ఈ సందర్భంగా అన్నారు.

తెలంగాణలో కుల రాజకీయాలు నడవవు

తెలంగాణలో కుల రాజకీయాలు నడవవని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్ని సామాజిక వర్గాలకు సమంగా చూస్తున్నారని తెరాస ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, వివేకానంద, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజులు పేర్కొన్నారు. ‘రేవంత్‌ అటు తెదేపాతో ఇటు భాజపాతో కుమ్మక్కయి కుట్ర రాజకీయాలు చేస్తున్నారు. బ్లాక్‌మెయిలింగ్‌, దూషణలు, బెదిరింపులతో కాలం గడుపుతున్నారు. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. ఓటుకు నోటు కేసులో ఆయన త్వరలోనే జైలుకెళ్లడం ఖాయం’ అని వారు తెలిపారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని