పదవులే పరమావధి కాదు

‘‘వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయమే అందరి ధ్యేయం కావాలి. ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. అందరికీ ఒకేసారి అవకాశాలు రావు. సమయానుకూలంగా వస్తాయి. పదవులే

Published : 26 May 2022 05:32 IST

పార్టీ విజయమే ధ్యేయం కావాలి

ఉమ్మడి ఖమ్మం జిల్లా తెరాస ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘వచ్చే ఎన్నికల్లో పార్టీ ఘన విజయమే అందరి ధ్యేయం కావాలి. ఆశావహులు ఎక్కువగా ఉన్నారు. అందరికీ ఒకేసారి అవకాశాలు రావు. సమయానుకూలంగా వస్తాయి. పదవులే పరమావధి కాదు. పార్టీ కోసం పనిచేసిన వారికి తగిన ప్రాధాన్యమిస్తాం’’అని తెరాస అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. విపక్షాలు కాకమ్మ కబుర్లు చెబుతూ విషప్రచారం చేస్తున్నాయని, వాటిని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని ఆయన సూచించారు. తెరాస లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు నేతృత్వంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ నేతలు సీఎం కేసీఆర్‌ను బుధవారం ప్రగతిభవన్‌లో కలిశారు. ఖమ్మం జిల్లాకు చెందిన బండి పార్థసారథిరెడ్దితో పాటు జిల్లాతో చిరకాల అనుబంధం ఉన్న వద్దిరాజు రవిచంద్రలకు రాజ్యసభ స్థానాలు కేటాయించడంపై వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం వారితో సమావేశమయ్యారు. ఖమ్మం జిల్లా తెలంగాణకు గుమ్మం లాంటిదని, అక్కడ పార్టీని మరింత బలోపేతం చేయాలని, అందరూ కలసికట్టుగా పనిచేసి జిల్లాలోని అన్ని స్థానాలను కైవసం చేసుకునేందుకు కృషి చేయాలని కేసీఆర్‌ సూచించారు. ‘‘ఇటీవలి సర్వేల్లో జిల్లాలో పార్టీ బలంగా ఉందని తేలింది. జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ప్రజలకు మరింత చేరువ కావాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రగతికి ప్రత్యేక ప్రాధాన్యమిచ్చాం. పెద్దఎత్తున నిధులను కేటాయించాం. సీతారామ ప్రాజెక్టు పనులను త్వరితగతిన పూర్తి చేయిస్తాం. అశ్వారావుపేట మండల కేంద్రంలో డివైడర్‌, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేస్తాం. జిల్లా అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు తమ ప్రతిపాదనలను సమర్పించాలి. అన్నింటినీ మంజూరు చేస్తాం. పార్టీలో విభేదాలు, అసంతృప్తి మాటలు వినిపించవద్దు. త్వరలోనే ఉమ్మడి జిల్లా నేతలతో ప్రత్యేకంగా సమావేశమవుతా’’నని సీఎం అన్నారు. ఆయన్ను కలిసిన వారిలో  ప్రభుత్వ విప్‌, భద్రాద్రి కొత్తగూడెం పార్టీ అధ్యక్షుడు రేగా కాంతారావు, ఎమ్మెల్సీ, ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షుడు తాతా మధుసూదన్‌, రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ అభ్యర్థి బండి పార్థసారథిరెడ్డి, కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు, పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌ రెడ్డి,  వైరా ఎమ్మెల్యే రాములు నాయక్‌, అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని