Published : 26 May 2022 05:18 IST

మాట నిలబెట్టుకోవడమే కాంగ్రెస్‌ నైజం

రచ్చబండలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

వైరా, న్యూస్‌టుడే: హామీలను నెరవేరుస్తూ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే కాంగ్రెస్‌ నైజమని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలోని రెబ్బవరంలో బుధవారం రాత్రి నిర్వహించిన రైతు రచ్చబండలో ఆయన మాట్లాడారు. వరంగల్‌ డిక్లరేషన్‌లో పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ ప్రకటించిన ప్రతి అంశాన్ని కచ్చితంగా అమలు చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలోకి వచ్చాక ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని అమలు చేస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రుణమాఫీ చేయకపోవడంతో రూ.లక్ష రుణం తీసుకున్న రైతులు.. నేడు బ్యాంకులకు రెండున్నర రెట్లకు పైగా బకాయి పడ్డారని తెలిపారు. ధాన్యం కొనలేని కేసీఆర్‌.. దిల్లీ వెళ్లి డ్రామాలాడటాన్ని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు వీహెచ్‌ మాట్లాడుతూ ఇందిర, రాజీవ్‌గాంధీల హయాంలో కాంగ్రెస్‌ అమలు చేసిన సంక్షేమ పథకాలతో దేశవ్యాప్తంగా ప్రజలు బాగుపడ్డారన్నారు. కేసీఆర్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనన్నారు. ఈ సందర్భంగా పలువురు కాంగ్రెస్‌లో చేరారు. 

ధాన్యానికి మద్దతు ధర అమలవుతోందా: పొన్నాల
ఈనాడు, హైదరాబాద్‌: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నియంతృత్వ విధానాలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్రంలో అసలు మద్దతు ధర అమలవుతోందా? అని ప్రశ్నించారు. నెల రోజులుగా రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఇబ్బందులు పడుతున్నారన్నారు. గాంధీభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ధాన్యంలో 33శాతం తేమ ఉన్నా రూ.1960 మద్దతు ధర చెల్లించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కొనుగోలు కేంద్రాల్లోని తేమ నిర్ధారణ యంత్రాలు సరిగా పనిచేయడంలేదు. 12 రోజులపాటు ఎండిన ధాన్యాన్ని తేమ యంత్రాల్లో పోస్తే 23 శాతం నమోదైంది. ఖాళీయంత్రం సైతం 1.7 శాతం తేమ చూపిస్తోంది. దీన్నిబట్టే యంత్రాల పనితీరు ఎంతబావుందో అర్థమవుతోంది. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్‌ సమీక్ష చేయాలి. పంజాబ్‌ రైతులకు పరిహారం ఇచ్చిన ఆయన. రాష్ట్ర రైతులకూ ఇవ్వాలి. హైదరాబాద్‌లో ఐఎస్‌బీకి వచ్చి మోదీ రాజకీయాలు మాట్లాడతారా? అధికారంలోకి వచ్చిన ఎనిమిదేళ్లలో రాష్ట్ర విభజన హామీలను ఏం చేశారో చెప్పాలి’ అని పొన్నాల వ్యాఖ్యానించారు.

జిల్లాకో వైద్యకళాశాల ఏమైంది?: గీతారెడ్డి
దిల్లీలోని బస్తీ దవాఖానాలను సందర్శించిన సీఎం కేసీఆర్‌ ఏనాడైనా హైదరాబాద్‌లోని బస్తీ దవాఖానాల్లో తిరిగారా అని మాజీ మంత్రి గీతారెడ్డి ఎద్దేవా చేశారు. గాంధీభవన్‌లో ఆమె బుధవారం పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. ‘గచ్చిబౌలి టిమ్స్‌ ఆసుపత్రికి రూ.కోట్ల ఖర్చుపెట్టి నేడు మూసేయడం వెనక ఆంతర్యమేమిటి? ప్రతీ జిల్లాకు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి కట్టిస్తానని హామీ ఇచ్చి ఎనిమిది ఏళ్లయినా అమలు కావడం లేదు’ అని పేర్కొన్నారు. జగ్గారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గానికో వంద పడకల ఆసుపత్రి, మండలానికో 30 పడకల ఆసుపత్రి అని ఇచ్చిన హామీ ఇప్పటివరకు నెరవేరలేదని విమర్శించారు.

గాంధీ విగ్రహ వివాదంపై శశిధర్‌రెడ్డి లేఖ
సికింద్రాబాద్‌ ఎంజీరోడ్‌లో గాంధీజీ విగ్రహం వివాదంపై మాజీ శాసనసభ్యుడు మర్రి శశిధర్‌రెడ్డి బుధవారం మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్‌కు లేఖ రాశారు. ఉన్న విగ్రహాన్ని కదిపే ప్రయత్నం చేయొద్దని.. రెండో విగ్రహం పెట్టే ఆలోచన మానుకోవాలని సూచించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని