మోదీ 8 ఏళ్ల పాలన.. భాజపా భారీ కార్యక్రమాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు త్వరలో ఎనిమిదేళ్లు ముగియనున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారీస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా భావిస్తోంది. అందులో భాగంగా జాతీయ

Published : 26 May 2022 05:18 IST

దేశవ్యాప్తంగా పర్యటించనున్న కేంద్ర మంత్రులు

దిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు త్వరలో ఎనిమిదేళ్లు ముగియనున్న సందర్భంగా దేశవ్యాప్తంగా భారీస్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని భాజపా భావిస్తోంది. అందులో భాగంగా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఆ పార్టీ కీలక నేతలు, కేంద్ర మంత్రులు బుధవారం సమావేశమయ్యారు. కార్యక్రమాలను పూర్తిస్థాయిలో సమీక్షించారు. ఎనిమిదేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం సాధించిన విజయాలను, చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రులు దేశంలోని వివిధ లోక్‌సభ నియోజకవర్గాలను సందర్శించి, ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో సంభాషించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై తుది నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా దర్మేంద్ర ప్రధాన్‌, స్మృతి ఇరానీ, జ్యోతిరాదిత్య సింధియా సహా పలువురు మంత్రులు పశ్చిమబెంగాల్‌లో పర్యటించనున్నారు. ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ.. పంజాబ్‌ను సందర్శించనున్నారు. తమకు కేటాయించిన రాష్ట్రాల్లో మంత్రులు రెండు మూడు రోజులు గడపనున్నారు. సమావేశానికి మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్‌, స్మృతి ఇరానీ, కిరణ్‌ రిజిజు తదితరులు హాజరయ్యారు. అమిత్‌ షా ప్రసంగంతో భేటీ ముగిసింది. ఎనిమిదేళ్ల పాలనకు సంబంధించి మే 30 నుంచి జూన్‌ 15 వరకు భాజపా.. సేవా, సుశాసన్‌, గరీబ్‌ కల్యాణ్‌ పేరుతో దేశవ్యాప్తంగా సంబరాలను చేపట్టనుంది. అంతకుముందు 2024 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని దేశంలో బలహీనంగా ఉన్న 74 వేల బూత్‌లను పటిష్ఠం చేసే కార్యక్రమాన్ని జేపీ నడ్డా ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని