ప్రధానిపై ప్రశ్నాస్త్రాలు

‘మోదీజీ! కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు? నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా, మిషన్‌ భగీరథ, కాకతీయలకు ఎందుకు నిధులివ్వలేదు? ఔషధనగరికి ఆర్థికసాయం

Published : 27 May 2022 04:54 IST

 హామీలు, ప్రాజెక్టుల ప్రస్తావన

మోదీజీ... ఇవన్నీ ఎప్పుడిస్తారంటూ హైదరాబాద్‌ నలుమూలలా బ్యానర్లు

ఈనాడు, హైదరాబాద్‌: ‘మోదీజీ! కేంద్ర ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఎందుకివ్వలేదు? నీతి ఆయోగ్‌ సిఫార్సు చేసినా, మిషన్‌ భగీరథ, కాకతీయలకు ఎందుకు నిధులివ్వలేదు? ఔషధనగరికి ఆర్థికసాయం ఏమైనా చేశారా? నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు? కాజీపేటకు రైల్వే కోచ్‌ కర్మాగారం ఏమైంది?’ అంటూ... 17కి పైగా ప్రశ్నలతో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా హైదరాబాద్‌ నలుమూలలా బ్యానర్లు వెలిశాయి. ‘మోదీజీ... కేంద్ర ప్రభుత్వం మాకు ఒక్క వైద్యకళాశాలను కూడా ఎందుకు మంజూరు చేయలేదు? జాతీయ శాస్త్ర, విద్య, పరిశోధన సంస్థ (ఐసెర్‌) ఎక్కడ ఉంది? రక్షణ పారిశ్రామిక నడవాను ఎందుకివ్వలేదు? సంప్రదాయ వైద్యకేంద్రాన్ని హైదరాబాద్‌ నుంచి గుజరాత్‌కు ఎందుకు తరలించారు? కొత్తగా నవోదయ విద్యాలయాలను ఎందుకు మంజూరు చేయడంలేదు? బయ్యారం ఉక్కు కర్మాగారం, ఐటీఐఆర్‌, ఐఐఎం, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ) ఏవి? హైదరాబాద్‌కు వరద సాయం ఎందుకు చేయలేదు? మెగా పవర్‌లూమ్‌ క్లస్టర్‌ ఎందుకు మంజూరు చేయలేదు?’ అనే ప్రశ్నలు బ్యానర్లపై ఉన్నాయి. బ్యానర్లను ఆయా అంశాలకు సంబంధించిన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. రైల్‌ నిలయం వద్ద కోచ్‌ కర్మాగారం బ్యానర్‌, వ్యవసాయ మార్కెట్‌ వద్ద పసుపు బోర్డుపై, జలమండలి వద్ద మిషన్‌ భగీరథ, నిఫ్ట్‌ వద్ద ఎన్‌ఐడీ, ఐఎస్‌బీ వద్ద ఐఐఎం, ట్యాంక్‌బండ్‌పై యుద్ధట్యాంకు వద్ద రక్షణ పారిశ్రామిక కారిడార్‌, చేనేతభవన్‌ వద్ద జౌళి సమూహం, సనత్‌నగర్‌ పారిశ్రామికవాడ వద్ద ఉక్కు కర్మాగారం, గాంధీ ప్రకృతి వైద్యకళాశాల వద్ద సంప్రదాయ వైద్యకేంద్రం, కేంద్రీయ విద్యాలయాల వద్ద నవోదయ విద్యాలయాలపై, ఎండీసీ వద్ద ఉక్కుకర్మాగారం, ఐటీ కారిడార్‌లో ఐటీఐఆర్‌పై, హుస్సేన్‌సాగర్‌ వద్ద కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రశ్నలతో బ్యానర్లు కట్టారు. బ్యానర్లు ఎవరు కట్టారో వాటిపై వివరాలు లేవు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని