రేవంత్‌ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌లో కలకలం

పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులు ఆయన వ్యాఖ్యలను ఖండించడం, బహిరంగ లేఖలు రాయడం ప్రారంభించారు. రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీకి మనుగడ

Published : 27 May 2022 05:02 IST

 రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీకి మనుగడ అనడాన్ని ఖండిస్తున్నా

వివరణ ఇవ్వాలని పీసీసీ చీఫ్‌కు మధుయాస్కీ లేఖ

ఈనాడు హైదరాబాద్‌: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు ఆ పార్టీలో కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్‌లోని ముఖ్య నాయకులు ఆయన వ్యాఖ్యలను ఖండించడం, బహిరంగ లేఖలు రాయడం ప్రారంభించారు. రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీకి మనుగడ ఉందంటూ రేవంత్‌ చేసిన వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీగౌడ్‌ లేఖ రాసి పత్రికలకు విడుదల చేశారు. ఆ వెంటనే ‘మే 7న గాంధీభవన్‌లో రాహుల్‌ చేసిన ప్రసంగాన్ని నాయకులు మరిచిపోవద్దు’ అంటూ ఏఐసీసీ రాష్ట్ర ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. వీటికి రేవంత్‌ స్పందిస్తూ.. ‘సామాజిక నిర్మాణాన్ని రక్షించడానికి కాంగ్రెస్‌ ప్రతిరోజూ పోరాడుతోంది. బీసీలు, ఎస్సీలు, ఎస్టీల సంక్షేమం కోసం ఎప్పుడూ అండగా నిలుస్తోంది. ఈ తత్వాన్నే నేను నమ్ముతా. నా ప్రకటనలను వక్రీకరించడం కంటే రాష్ట్రంలోని సమస్యలపై దృష్టి పెట్టాలి’ అని ట్వీట్‌ చేశారు. కాగా కులాల గురించి రేవంత్‌ మాట్లాడటాన్ని తప్పు పడుతూ మరో నాయకుడు మహేశ్వర్‌రెడ్డి తొలుత స్పందించారు. ఇప్పుడు మధుయాస్కీ సుదీర్ఘలేఖ రాస్తూ.. దీనిపై వెంటనే వివరణ ఇవ్వాలని కోరారు. లేఖ వివరాలివీ..

కాంగ్రెస్‌ మూల విధానాలకు వ్యతిరేకం

‘‘కాంగ్రెస్‌ తెలంగాణ శాఖ రాష్ట్ర అధ్యక్షులుగా ఉంటూ రెడ్లకు పగ్గాలిస్తేనే పార్టీలకు మనుగడ అంటూ మీరు చేసిన వ్యాఖ్యలు పార్టీ మూలవిధానాలకు వ్యతిరేకం. వీటిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. కొత్తగా పార్టీలోకి వచ్చి మీరు పీసీసీ అధ్యక్షుడైనా, నేను ప్రచార కమిటీ ఛైర్మన్‌ అయినా అది సోనియా, రాహుల్‌ల చలవే. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులలో వరంగల్‌ డిక్లరేషన్‌, రాహుల్‌గాంధీ సభతో ఉత్తేజితులై, కేసీఆర్‌ మోసాలను గ్రహించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు మనపార్టీ వైపు చూస్తున్నాయి. ఈవర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మీ వ్యాఖ్యలు ఉండటం అత్యంత దారుణం. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం పదవులు కల్పించాలంటూ ఉదయ్‌పుర్‌లో కాంగ్రెస్‌ తీసుకున్న నిర్ణయాలనూ మీరు వ్యతిరేకిస్తున్నట్లు అర్థమవుతోంది. ఏడేళ్లు పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమకుమార్‌రెడ్డి, సీఎల్పీ నేతగా జానారెడ్డి ఉన్నా, కొత్తగా పార్టీలో చేరిన మీకు వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పదవి ఇచ్చినా 2018లో పార్టీ ఓడిపోయిందన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలి’’ అని మధుయాస్కీ లేఖలో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని