2న ఉద్యమకారులు, అమరుల కుటుంబాలతో సభ: సంజయ్‌

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 2న భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు, కవులు, కళాకారులతో సభను నిర్వహించాలని కమలదళం నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న పార్టీ నేతలు, అధికార ప్రతినిధులతో

Published : 28 May 2022 05:45 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్‌ 2న భాజపా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమకారులు, అమరుల కుటుంబాలు, కవులు, కళాకారులతో సభను నిర్వహించాలని కమలదళం నిర్ణయించింది. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొన్న పార్టీ నేతలు, అధికార ప్రతినిధులతో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ శుక్రవారమిక్కడ పార్టీ కార్యాలయంలో వేర్వేరుగా సమావేశమయ్యారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున సభను నిర్వహించి, ఆ రోజున చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో ఉద్యమ ఆకాంక్షలు నెరవేరడం లేదని, నిజమైన తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తామని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ అభివృద్ధికి కేంద్రం ముందుకు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదు. ఏపీ, తెలంగాణ సీఎంలు జగన్‌, కేసీఆర్‌ కుమ్మక్కై విభజన చట్టంలోని అంశాలు పరిష్కారమవకుండా వ్యూహాత్మకంగా జాప్యం చేస్తున్నారు. దీన్ని కేంద్రంపై నెట్టేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఈ రాజకీయాల్ని తిప్పికొట్టాలి’’ అని సూచించారు. భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్‌వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, కార్యదర్శి ఎస్‌.ప్రకాశ్‌రెడ్డి, అధికార ప్రతినిధులు కృష్ణసాగర్‌ రావు, ఎన్‌వీ.సుభాష్‌, పాల్వాయి రజనీకుమారి, జె.సంగప్ప, రాకేశ్‌రెడ్డి, రాణి రుద్రమాదేవి, పోరెడ్డి కిశోర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌, మాజీమంత్రి చంద్రశేఖర్‌, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్‌.విఠల్‌, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, రాణి రుద్రమాదేవి, దరువు ఎల్లన్నతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలపై వెంటనే స్పందించడం లేదని, తొమ్మిది మంది ఉన్నా ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదు అంటూ అధికార ప్రతినిధులపై బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. భాజపాపై అధికార పార్టీ చేస్తున్న విమర్శలపై సకాలంలో స్పందించాలని వారికి సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని