పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు

కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు లభిస్తుందని.. ఆ విశ్వాసాన్ని నాయకులు కలిగి ఉండాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇండియన్‌ ఓవర్సీస్‌

Published : 30 May 2022 04:55 IST

న్యూజెర్సీ సమావేశంలో రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌లో చేరిన భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి

గాంధీభవన్‌, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీలో కష్టపడ్డ వారికి గుర్తింపు లభిస్తుందని.. ఆ విశ్వాసాన్ని నాయకులు కలిగి ఉండాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఇండియన్‌ ఓవర్సీస్‌ కాంగ్రెస్‌(యూఎస్‌ఏ) తెలంగాణ చాప్టర్‌ ఆధ్వర్యంలో న్యూజెర్సీలో జరిగిన కార్యక్రమంలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి కాంగ్రెస్‌లో చేరారు. రేవంత్‌రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాష్కీలు పార్టీ కండువా కప్పి ఆమెను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. శోభారాణి కాంగ్రెస్‌లో చేరడం శుభపరిణామమని చెప్పారు. ఎప్పుడూ దేశం, ప్రజల కోసం ఆలోచన చేసేది కాంగ్రెస్‌ పార్టీ మాత్రమేనన్నారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, స్వయం పాలనను కాంగ్రెస్‌ సంపూర్ణంగా విశ్వసిస్తుందని ఉద్ఘాటించారు. శోభారాణి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పని చేసిన తాను, కాంగ్రెస్‌పై నమ్మకంతో ఆ పార్టీలో చేరుతున్నానని తెలిపారు.

1, 2 తేదీల్లో కాంగ్రెస్‌ రాష్ట్రస్థాయి ‘చింతన్‌ శిబిర్‌’
జాతీయ కాంగ్రెస్‌ కమిటీ ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన ‘నవ సంకల్ప్‌ శిబిర్‌’ తరహాలో రాష్ట్రస్థాయిలో ‘చింతన్‌ శిబిర్‌’ కార్యక్రమాలను నిర్వహించాలని తెలంగాణ పీసీసీ నిర్ణయించింది. హైదరాబాద్‌లో జూన్‌ 1, 2 తేదీల్లో నిర్వహించతలపెట్టిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి నవ సంకల్ప్‌ శిబిర్‌ కమిటీని ప్రకటించింది. కమిటీకి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఛైర్మన్‌గా, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ తెలంగాణ ఛైర్మన్‌ ఎ.మహేశ్వర్‌రెడ్డి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు సహా 34 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని