Telangana Assembly: భాజపా సభ్యుల సస్పెన్షన్‌

అసెంబ్లీ సమావేశాల తొలిరోజే సభ వేడెక్కింది. శాసనసభలో నిరసన తెలిపిన భాజపా సభ్యులపై వేటు పడింది. బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకూ వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దీనికి నిరసనగా అసెంబ్లీ బయటకొచ్చి ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌లను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌ స్టేషనుకు తరలించారు. దీంతోవారు గవర్నర్‌ తమిళసైని కలిసి స్పీకర్‌ తీరుపై ఫిర్యాదు చేశారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో వెల్‌లోకి వచ్చినందుకే భాజపా సభ్యుల్ని సస్పెండ్‌ చేసినట్లు ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు స్పష్టంచేశారు.

Updated : 08 Mar 2022 06:01 IST

సమావేశాలు ముగిసేవరకూ వర్తింపు  
గవర్నర్‌కు పార్టీ నేతల ఫిర్యాదు
నేడు రాష్ట్రవ్యాప్త నిరసనలకు నిర్ణయం

ఈనాడు, హైదరాబాద్‌: అసెంబ్లీ సమావేశాల తొలిరోజే సభ వేడెక్కింది. శాసనసభలో నిరసన తెలిపిన భాజపా సభ్యులపై వేటు పడింది. బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకూ వారిని సస్పెండ్‌ చేస్తున్నట్లు సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. దీనికి నిరసనగా అసెంబ్లీ బయటకొచ్చి ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌లను పోలీసులు అరెస్టు చేసి బొల్లారం పోలీస్‌ స్టేషనుకు తరలించారు. దీంతోవారు గవర్నర్‌ తమిళసైని కలిసి స్పీకర్‌ తీరుపై ఫిర్యాదు చేశారు. బడ్జెట్‌ ప్రవేశపెట్టే సమయంలో వెల్‌లోకి వచ్చినందుకే భాజపా సభ్యుల్ని సస్పెండ్‌ చేసినట్లు ఆర్థికమంత్రి టి.హరీశ్‌రావు స్పష్టంచేశారు. రాజ్యసభలో తమ స్థానాల వద్ద నిలబడి నిరసన తెలిపినా ఇటీవల 12 మంది ఎంపీలను సమావేశాలు మొత్తం కాలానికి సస్పెండ్‌ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. సోమవారం ఉదయం 11.30 గంటలకు సభ ప్రారంభం కాగానే భాజపా, కాంగ్రెస్‌ సభ్యులు తమ సీట్లలో నిలబడి మాట్లాడే అవకాశం ఇవ్వాలని పెద్దగా మాట్లాడుతూ సభాపతిని కోరారు. కాంగ్రెస్‌ సభ్యులంతా ముందు వరసలో ఉన్న ఆ పార్టీ పక్షనేత భట్టి విక్రమార్క వద్దకు వచ్చి గుంపుగా నిలబడి నిరసన తెలిపారు. వారి వెనక వరసల్లో మెడలో నల్లకండువాలతో ఉన్న భాజపా సభ్యులు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌ సీట్లలో లేచి నిలబడి.. గవర్నర్‌ ప్రసంగం లేకుండా సభను ప్రారంభించడంపై నిరసన తెలిపారు. ఇవి కొనసాగుతుండగానే ఆర్థికమంత్రి తనప్రసంగాన్ని కొనసాగించారు. అరగంట తరవాత రాజాసింగ్‌ సభాపతి పోడియం వద్దకెళ్లి గట్టిగా మాట్లాడుతూ నిరసన తెలిపారు. పోడియం వద్ద ఆయనను మార్షల్స్‌ అడ్డుకున్నారు. దీంతో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ముగ్గురు భాజపా సభ్యులను సభ నుంచి సస్పెండ్‌ చేయాలంటూ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా.. సభాపతి బడ్జెట్‌ సమావేశాలు ముగిసేవరకూ ముగ్గురిని సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించి.. బయటికి వెళ్లాలని ఆదేశించారు. వారు వెళ్లకపోవడంతో మార్షల్స్‌ వచ్చి బయటికి పంపారు.  అప్పుడు కూడా కొంతసేపు కాంగ్రెస్‌ సభ్యులు భట్టి సీటు వద్ద గుంపుగా నిలబడే ఉన్నారు. భాజపా సభ్యుల సస్పెన్షన్‌ అనంతరం వారు వాకౌట్‌ చేశారు. సస్పెన్షన్‌ అనంతరం భాజపా ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు, రాజాసింగ్‌ నినాదాలు చేసుకుంటూ బయటకు వస్తుండగా ఒక పోలీసు అధికారి ఎమ్మెల్యే ఫోను లాక్కోవడంతో తీవ్ర వాగ్వాదం జరిగింది. అనంతరం గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు దీక్షకు పూనుకోగా మార్షల్స్‌ వచ్చి వారిని బయటకు తరలించారు. పోలీసులు వారిని అక్కడి నుంచి బొల్లారం పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. మధ్యాహ్నం 2 గంటలకు వదిలేశారు. 

మీరు జోక్యం చేసుకోండి.. గవర్నర్‌కు వినతి 

తమను సస్పెండ్‌ చేయడంపై భాజపా ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రాజేందర్‌, రఘునందన్‌రావుతో పాటు పార్టీ ముఖ్యనేతలు కె.లక్ష్మణ్‌, ఎన్‌.రాంచందర్‌రావు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ‘స్క్రిప్టు ప్రకారమే అధికారపక్షం మమ్మల్ని సస్పెండ్‌ చేసింది. మహారాష్ట్రలో 12 మంది ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను సుప్రీం కోర్టు తప్పుపట్టిన విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు’ అని గవర్నర్‌కు తెలిపారు.

ఆర్‌ఆర్‌ఆర్‌ ట్రైలర్‌ చూసే సీఎంకు భయం పట్టుకుంది: సంజయ్‌ ధ్వజం

భాజపా ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందస్తు ప్లాన్‌, సీఎం కేసీఆర్‌ రాసుకున్న స్క్రిప్టును అమలుచేయడమేనని నిప్పులు చెరిగారు.  ఆయన విలేకరులతో మాట్లాడుతూ- ఆర్‌ఆర్‌ఆర్‌ (రాజేందర్‌, రాజాసింగ్‌, రఘునందన్‌) ట్రైలర్‌కే సీఎంకు వణుకు పుడుతోందని వ్యాఖ్యానించారు. ‘సభలో చర్చ జరిగితే ప్రభుత్వ డొల్లతనం బయటపడుద్దనే భయమా? అయితే అసెంబ్లీ ఎందుకు? ప్రగతిభవన్‌లో సభ పెట్టుకుంటే సరిపోతుంది’ అంటూ ధ్వజమెత్తారు.  మంగళవారం భాజపా నిరసనలు తెలుపుతుందన్నారు. ప్రశ్నించేవారంటే కేసీఆర్‌కు గిట్టదని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఓ ప్రకటనలో విమర్శించారు.

తెరాస వీడ్కోలు ప్రసంగంలా ఉంది: కిషన్‌రెడ్డి

ఈనాడు, దిల్లీ ఆర్థికమంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో చేసిన బడ్జెట్‌ ప్రసంగం ఏడాది ముందుగా ప్రభుత్వానికి వీడ్కోలు పలుకుతూ చేసిన ప్రసంగంలా ఉందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎద్దేవాచేశారు. కేంద్రాన్ని విమర్శించడానికే ఎక్కువ సమయం కేటాయించారని ధ్వజమెత్తారు. ఆయన సోమవారం విలేకర్లతో మాట్లాడారు. ‘‘బడ్జెట్‌లో మాటలు కోటలు దాటాయి. సమావేశాలు ప్రజాస్వామ్యబద్ధంగా లేవు. దేశంలో ఎన్నో ప్రభుత్వాలు గవర్నర్లతో విభేదించినా ఈ స్థాయిలో వారిని అవమానించిన దాఖలా లేదు.  గవర్నర్‌ ప్రసంగం లేకుండా సమావేశాలు నిర్వహిస్తున్నందుకు నిరసన తెలిపిన భాజపా సభ్యులను మొత్తం సమావేశాల నుంచి సస్పెండ్‌ చేయడం దారుణం’’ అని కిషన్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు