TS News: 3 నెలల క్రితం ప్రేమపెళ్లి.. బ్లాక్‌ ఫంగస్‌తో మృతి

పెద్దలను ఒప్పించి మూడు నెలల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. జీవితం ఆనందంగా సాగిపోతుందనుకున్న క్రమంలో కరోనా అతణ్ణి చుట్టుముట్టుంది.. చికిత్స తీసుకొని మహమ్మారిపై విజయం సాధించినా.. చివరికి బ్లాక్‌ఫంగస్‌ ప్రాణాలు తీసింది.

Updated : 09 Jun 2021 12:55 IST

రూ.27 లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణం

ఘట్‌కేసర్‌, న్యూస్‌టుడే: పెద్దలను ఒప్పించి మూడు నెలల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.. జీవితం ఆనందంగా సాగిపోతుందనుకున్న క్రమంలో కరోనా అతణ్ణి చుట్టుముట్టుంది.. చికిత్స తీసుకొని మహమ్మారిపై విజయం సాధించినా.. చివరికి బ్లాక్‌ఫంగస్‌ ప్రాణాలు తీసింది. లక్షలు ఖర్చు పెట్టినా తమ కొడుకు దక్కలేదని ఆ కుటుంబం కన్నీరుమున్నీరైంది. ఈ విషాద పరిణామం మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని యంనంపేటలో చోటుచేసుకుంది. యంనంపేటకు చెందిన నక్క రాజేశ్‌యాదవ్‌(29) అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లైన నెల రోజులకు కొవిడ్‌ బారిన పడ్డాడు.. ప్రైవేటు ఆసుపత్రిలో నెల రోజులపాటు చికిత్స పొంది కరోనా నుంచి బయటపడ్డాడు. ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. కొద్దిరోజులకే అనారోగ్యానికి గురై నాగారంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ చికిత్స పొందిన తర్వాత నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు నిర్వహించిన పరీక్షలో బ్లాక్‌ ఫంగస్‌గా తేలింది. చికిత్స చేసి వైద్యులు ఓ కన్ను తీసేశారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. గాంధీలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి రాజేశ్‌ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తెరాస యువజన విభాగంలో పనిచేస్తున్న రాజేశ్‌యాదవ్‌ అంత్యక్రియులు మంగళవారం గ్రామంలో జరిగాయి. ఆసుపత్రిలో రూ.27 లక్షలు ఖర్చు పెట్టినా ప్రాణం దక్కలేదని కుటుంబసభ్యులు రోదించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని