Disha Case: సజ్జనార్‌ను విచారించాలనిపించలేదా?

‘దిశ’ అత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు నియమించిన సిట్‌ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ను కమిషన్‌ శుక్రవారం విచారించింది.

Updated : 25 Sep 2021 07:46 IST

కాల్పుల్లో గాయపడిన పోలీసుల వివరాలెందుకు లేవు

మహేశ్‌భగవత్‌కు జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ ప్రశ్న

ఈనాడు, హైదరాబాద్‌: ‘దిశ’ అత్యాచార కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తు జరిపేందుకు నియమించిన సిట్‌ చీఫ్‌ మహేశ్‌ భగవత్‌ను కమిషన్‌ శుక్రవారం విచారించింది. నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌ సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో జరిగినందున అప్పటి కమిషనర్‌ సజ్జనార్‌ను, శంషాబాద్‌ జోన్‌ డీసీపీ ప్రకాశ్‌రెడ్డిని విచారించారా? అని భగవత్‌ను కమిషన్‌ ప్రశ్నించింది. ఆయన లేదని జవాబిచ్చారు. సంచలనం సృష్టించిన కేసుల్లో వారిని విచారించాలని అనిపించలేదా? అని అడగ్గా.. ఆ అవసరం లేదనిపించిందన్నారు. ఘటనాస్థలంలో వెలుతురు ఉందని దర్యాప్తు అధికారి (షాద్‌నగర్‌ ఏసీపీ) రికార్డు చేశారని, అదే అధికారి చీకటి ఉందనిపించేలా శబ్దం వచ్చిన వైపు కాల్చాలని పోలీస్‌ బృందాన్ని ఆదేశించారని పేర్కొన్నట్లు కమిషన్‌ పేర్కొంది. వైరుధ్యాలు కలిగిన ఈ రెండు అంశాలపై సిట్‌ దర్యాప్తులో గుర్తించారా? అని ప్రశ్నించగా.. లేదని భగవత్‌ బదులిచ్చారు. ఎదురుకాల్పులు జరిగిన ప్రదేశం 5వ గట్టు అని మీకెలా తెలిసిందని అడిగితే.. సిట్‌ దర్యాప్తు అధికారి సురేందర్‌రెడ్డి అభిప్రాయమని చెప్పారు. ‘దిశ’కు సంబంధించిన వస్తువుల్ని ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశం నుంచే స్వాధీనం చేసుకున్నట్లు మీకు ఎలా తెలుసు అని అడగ్గా.. అది సిట్‌ పరిధిలో లేని అంశంగా పేర్కొన్నారు. నిందితులను విచారణ నిమిత్తం ఉంచిన రవి గెస్ట్‌హౌస్‌ యజమానికి సంబంధించి రెండు విధాలుగా వాంగ్మూలం ఎలా నమోదు చేశారనగా సరైన జవాబు లభించలేదు. ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సిట్‌ సొంత స్కెచ్‌ రూపొందించిందా? అని అడిగితే లేదన్నారు. ఠాణాలో ఆయుధ సామగ్రి సంబంధిత రిజిస్టర్‌ ఉంటుందా? అన్న ప్రశ్నకు ఉంటుందన్నారు. నివేదికలో ఆ అంశం ఎందుకు రాయలేదని అడిగితే సమాధానం ఇవ్వలేదు.

పొరపాటున అలా అనుకున్నాను

సిట్‌ కేస్‌ డైరీ రాసిన వనపర్తి ఎస్పీ అపూర్వారావును కమిషన్‌ విచారించింది. ‘ఎదురుకాల్పుల సమయంలో కానిస్టేబుల్‌ అరవింద్‌గౌడ్‌కు గాయాలయ్యాయని మీరు చెప్పారు. ఆసుపత్రి నివేదికలో హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేశ్వర్లుకు రక్తగాయాలైనట్లు ఉంది’ అని కమిషన్‌ ప్రశ్నించింది. పొరపాటున అనుకున్నానని అపూర్వారావు బదులిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని