అద్భుత ప్రతిభ.. బతుకు మాత్రం దినదినగండం

అద్భుతమైన ప్రతిభ ఆమె సొంతం.. బతుకు మాత్రం దినదినగండం. ఏడాదిగా ప్రాణాంతకమైన క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆ బాలిక పేరు లక్ష్మీ మనోజ్ఞ(14). పాటలు పాడటం, కళాకృతులను తయారు చేయడంలో ఆమె దిట్ట.

Updated : 18 Nov 2021 09:31 IST

రవీంద్రభారతిలో పాటలు పాడుతున్న లక్ష్మీమనోజ్ఞ

రవీంద్రభారతి, న్యూస్‌టుడే: అద్భుతమైన ప్రతిభ ఆమె సొంతం.. బతుకు మాత్రం దినదినగండం. ఏడాదిగా ప్రాణాంతకమైన క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆ బాలిక పేరు లక్ష్మీ మనోజ్ఞ(14). పాటలు పాడటం, కళాకృతులను తయారు చేయడంలో ఆమె దిట్ట. బుధవారం హైదరాబాద్‌ రవీంద్రభారతిలో తెలుగు, హిందీ, ఆంగ్లం, సింహళి, కొరియన్‌ భాషల్లో ఏకధాటిగా అరగంటకు పైగా (2,021 సెకన్ల పాటు) వివిధ గీతాలను ఆలపించి ‘వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌’లో చోటు దక్కించుకుంది. తిరుపతికి చెందిన నరసింహా, తేజోవతి దంపతుల పెద్దమ్మాయి అయిన లక్ష్మీమనోజ్ఞ సంగీతంతో పాటు వ్యర్థాలతో అద్భుతమైన కళాకృతులను తయారు చేయడంలో దిట్ట.

ఏడాది కిందట అనారోగ్యం బారినపడటంతో వైద్యులను సంప్రదించగా.. పరీక్షలు జరిపి క్యాన్సర్‌ అని నిర్ధారించారు. ఎలాగైనా బిడ్డను కాపాడుకోవాలని తల్లిదండ్రులు తమ జీవనాధారమైన చిరు వ్యాపారాన్ని కూడా వదులుకున్నారు. హైదరాబాద్‌కు తీసుకొచ్చి ఏడాదిగా బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమె ప్రతిభకు గుర్తింపు లభించేలా వండర్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ కోసం ప్రయత్నం చేశారు. శ్రీరాజమాత ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మయూరి ఆర్ట్స్‌ సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని