Chhattisgarh: ఆమె.. అభినవ సావిత్రి

ఛత్తీస్‌గఢ్‌లో వారం క్రితం మావోయిస్టులు పహరించిన సబ్‌ ఇంజినీరును.. ఆయన భార్య, మూడేళ్ల కుమారుడు ప్రాధేయపడటంతో వారు విడిచిపెట్టారు. దీంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల వివరాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మాన్‌కేళి-ఘడ్‌గోర్ణా ప్రధాన రహదారి నిర్మాణ పనులు చేపట్టింది. ఈ పనులను నిలిపేయాలని మావోయిస్టులు పలుమార్లు అధికారులను హెచ్చరించారు.

Updated : 18 Nov 2021 10:32 IST

మావోయిస్టుల చెర వీడిన ఇంజినీరు

భార్య, కుమారుడి వేడుకోలుతో విడుదల

భార్య అర్పితతో అజయ్‌ రోషన్‌

దుమ్ముగూడెం, న్యూస్‌టుడే: అలనాటి సతీసావిత్రి యముడితో పోరాడి తన భర్త ప్రాణాలను కాపాడుకుందని పురాణాల్లో చదువుకున్నాం. అడవుల బాట పట్టి మావోయిస్టుల చెరలో ఉన్న భర్తను రక్షించుకుంది ఛత్తీస్‌గఢ్‌లోని ఓ ఇంజినీర్‌ భార్య. వారం క్రితం మావోయిస్టులు అపహరించిన సబ్‌ ఇంజినీరును.. ఆయన భార్య, మూడేళ్ల కుమారుడు ప్రాధేయపడటంతో వారు విడిచిపెట్టారు. దీంతో కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల వివరాల ప్రకారం.. కేంద్ర ప్రభుత్వం ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మాన్‌కేళి-ఘడ్‌గోర్ణా ప్రధాన రహదారి నిర్మాణ పనులు చేపట్టింది. ఈ పనులను నిలిపేయాలని మావోయిస్టులు పలుమార్లు అధికారులను హెచ్చరించారు. అయినా నిలిపివేయకపోవడంతో ఆగ్రహించిన మావోయిస్టులు ఈ నెల 11న బీజాపూర్‌ జిల్లా గోర్నా-మన్కేలీ అటవీ ప్రాంతంలో పనులను పర్యవేక్షిస్తున్న సబ్‌ ఇంజినీరు అజయ్‌ రోషన్‌తోపాటు అటెండర్‌ లక్ష్మణ్‌ను అపహరించారు. ఆ తరవాతి రోజు లక్ష్మణ్‌ను విడిచిపెట్టి అజయ్‌ను తమతోపాటు అడవుల్లోకి తీసుకెళ్లారు.

ఈ ఘటనతో ఆందోళనకు గురైన ఆయన భార్య అర్పిత.. తన భర్తను విడిచిపెట్టాలని విలపిస్తూ తన మూడేళ్ల కుమారుడితో కలిసి ఓ వీడియో విడుదల చేసింది. అనంతరం మంగళవారం ఆ రాష్ట్ర మీడియా, ఆదివాసీ సంఘాల ప్రతినిధులతో అడవి బాట పట్టి మావోయిస్టులను కలిసింది. దీంతో మావోయిస్టులు బుధవారం ఉదయం ప్రజాకోర్టు నిర్వహించారు. సబ్‌ ఇంజినీరుపై పలు ఆరోపణలు చేసి.. పనులు కొనసాగించవద్దంటూ హెచ్చరించారు. భార్య అర్పిత బోరున విలపిస్తూ తన భర్తను వదిలిపెట్టాలంటూ వేడుకుంది. దీంతో అజయ్‌ని మానవతా దృక్పథంతో విడుదల చేస్తున్నట్లు మావోయిస్టులు ప్రకటించారు. అజయ్‌ రోషన్‌ తన భార్య, కుమారుడితో కలిసి క్షేమంగా ఇంటికి చేరుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని