రాజకీయ పార్టీల్లో పారదర్శకత కరవు

రాజకీయ పార్టీలకు పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడం ప్రస్తుతం రాజ్యాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

Updated : 27 Nov 2021 06:05 IST

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: రాజకీయ పార్టీలకు పారదర్శకత, జవాబుదారీతనం లేకపోవడం ప్రస్తుతం రాజ్యాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ఒకటని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 1600 రిజిస్టర్డ్‌ రాజకీయ పార్టీలున్నాయని, వీటిలో కొన్ని బినామీ కంపెనీల్లా ఏర్పాటయ్యాయన్నారు. ఈ పార్టీల కార్యకలాపాలపై పర్యవేక్షణ లేదని, వాటికి వచ్చే నిధులపై ఆడిట్‌ లేదని చెప్పారు. పార్టీలకు సమాచార హక్కు వర్తించదని, దీన్ని ఎవరూ ప్రశ్నించజాలరన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ‘రాజ్యాంగ హక్కులు హోదా, సవాళ్లు’ అనే అంశంపై సోషల్‌ డెమొక్రాటిక్‌ ఫోరం (ఎస్‌డీఎఫ్‌) శుక్రవారం నిర్వహించిన ఆన్‌లైన్‌ సమావేశంలో జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాజకీయ పార్టీలకు బుల్‌డోజర్‌ మెజారిటీ ఇవ్వడం ద్వారా ఇబ్బందికరమేనన్నారు.  కార్యక్రమంలో ప్రొఫెసర్‌ మాడభూషి శ్రీధర్‌, మాజీ ఐఏఎస్‌ హర్ష మందర్‌, ఎస్‌డీఎఫ్‌ కన్వీనర్‌ ఎ.మురళి పాల్గొన్నారు.


సత్వర న్యాయంతో రాజ్యాంగ ఫలితాలు: జస్టిస్‌ పి.నవీన్‌రావు

ప్రజలకు సత్వర న్యాయం లభించినపుడు.. రాజ్యాంగ ఫలితాలు అందుతాయని జస్టిస్‌ పి.నవీన్‌రావు అన్నారు. హైకోర్టులో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల పరిష్కారానికి ప్రత్యేక కార్యక్రమం రూపకల్పన చేస్తామని చెప్పారు. ఇందుకోసం నిపుణులను నియమించి నిష్ఫలమైన, కాలం చెల్లిన కేసులను గుర్తించి పరిష్కారానికి చర్యలు చేపడతామన్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైకోర్టు బార్‌ అసోసియేషన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జస్టిస్‌ నవీన్‌రావు పాల్గొని రాజ్యాంగ లక్ష్యాలను వివరించారు. కార్యక్రమంలో జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి, జస్టిస్‌ శ్రీసుధ, జస్టిస్‌ రాధారాణి, జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌, జస్టిస్‌ మాధవీదేవి, అడ్వొకేట్‌ జనరల్‌ బి.ఎస్‌.ప్రసాద్‌, బార్‌ కౌన్సిల్‌ ఛైర్మన్‌ ఎ.నరసింహారెడ్డి, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పొన్నం అశోక్‌గౌడ్‌ పాల్గొన్నారు.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని