నెగెటివ్‌ నివేదిక ఉంటేనే అనుమతి!

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలకలం నేపథ్యంలో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా పరీక్షలను పెంచేందుకు సిద్ధమవుతున్నారు

Updated : 28 Nov 2021 05:51 IST

విమానాశ్రయ అధికారుల అప్రమత్తం

ఈనాడు, హైదరాబాద్‌: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కలకలం నేపథ్యంలో హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా పరీక్షలను పెంచేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం వివిధ దేశాల నుంచి వస్తున్న ప్రయాణికులకు 72 గంటల ముందు చేయించుకున్న ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్ట్‌ తప్పనిసరిగా ఉండాలన్న నిబంధనను అమలు చేస్తున్నారు. విమానాశ్రయంలో దిగిన తర్వాత మరోసారి పరీక్షలు చేసి.. పంపించేస్తున్నారు. ఎవరికైనా పాజిటివ్‌ అని తేలితే హోం క్వారంటైన్‌లో ఉండాలని లేదా ఆసుపత్రికి వెళ్లాలని ఫోన్‌ ద్వారా సూచిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌ నుంచి ఆఫ్రికా దేశాలకు నేరుగా విమాన సర్వీసులు లేవు. ఆ దేశాల ప్రయాణికులు ముంబయి, బెంగళూరు లేదా దిల్లీ చేరుకుని.. అక్కడి నుంచి హైదరాబాద్‌ వస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా, జింబాబ్వే, నమీబియా, బోట్స్‌వానాలతో పాటు ఇజ్రాయెల్‌, హాంకాంగ్‌, బెల్జియం తదితర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయాలని నిర్ణయించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇది అమలులోకి వస్తే పరీక్షల్లో నెగెటివ్‌ రిపోర్టు వస్తేనే వారిని విమానాశ్రయం నుంచి బయటికి అనుమతిస్తారు. ఈ విషయంపై వైద్యారోగ్య శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు రావాల్సి ఉందని అధికారులు తెలిపారు. ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించేందుకు విమానాశ్రయంలో ఒక కేంద్రం ఉండగా, మరో రెండింటిని అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం మహారాష్ట్రలో రెండు డోసులు వేసుకున్నవారిని లేదా 72 గంటల మందు ఆర్టీపీసీఆర్‌ నెగెటివ్‌ రిపోర్టు ఉంటేనే అనుమతిస్తున్నారు. దీనికి అనుగుణంగా హైదరాబాద్‌ నుంచి ముంబయి వెళ్లే ప్రయాణికులను విమానయాన సంస్థలు ఆయా ధ్రువీకరణలు ఉంటేనే అనుమతిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని