
ఈడీ కేసును కొట్టి వేయండి
హైకోర్టును ఆశ్రయించిన ఎంపీ సుజనా
ఈనాడు, హైదరాబాద్: చెన్నై కోర్టులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ ఎంపీ సుజనా చౌదరి (వై.సత్యనారాయణ చౌదరి) తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంకు రుణాల ఎగవేతకు సంబంధించి బీసీఈపీఎల్ (బెస్ట్ అండ్ క్రాంప్టన్ ఇంజినీరింగ్ ప్రాజెక్ట్ లిమిటెడ్)పై సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆధారంగా ఈడీ నమోదు చేసిన కేసులో 6వ నిందితుడుగా చేర్చడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. ‘ఈ కేసులోని సహ నిందితుల వాంగ్మూలాల ఆధారంగా నన్ను కేసులో ఇరికించారు. నా పాత్రకు సంబంధించి ఒక్క ఆధారమూ లేదు. సీబీఐ దాఖలు చేసిన అభియోగపత్రంలో నన్ను నిందితుడిగా చేర్చలేదన్న విషయాన్ని ఈడీ పట్టించుకోలేదు. బీసీఈపీఎల్ నిర్వహణలో ఎలాంటి పాత్ర లేదు. సుజనా గ్రూపు సంస్థలతో ఈ కంపెనీకి సంబంధంలేదు. నా ఖాతాలోకి వచ్చిన రూ.45 కోట్ల గురించి ఈడీ చేసిన ఆరోపణలకు ఆధారం లేదు. ఈ మొత్తాలన్నీ చట్టబద్ధంగా వచ్చాయి. ఆ వివరాలను సంబంధిత అధికారులకు వెల్లడించాను. నా నివాసాలతో పాటు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో కంపెనీలకు చెందిన 124 రబ్బరు స్టాంపులు దొరికినంత మాత్రాన ఆరోపణలు చేయడం సరికాదు. దుర్వినియోగం చేసినప్పుడే వాటి ప్రస్తావన ఉండాలి. కంపెనీ కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదు. కేవలం రాజకీయ దురుద్దేశాలతో ఈ కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన దస్త్రాలను చెన్నై కోర్టు నుంచి తెప్పించి పరిశీలించాలి. ఈ పిటిషన్ తేలేదాకా కింది కోర్టులో విచారణను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలి’ అని సుజన కోరారు. దీనిపై విచారించిన జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ఈ నెల 7వ తేదీకి వాయిదా వేశారు.