కృష్ణా ట్రైబ్యునల్‌ గడువును ఏటా పొడిగిస్తున్నాం: కేంద్ర మంత్రి

కృష్ణా ట్రైబ్యునల్‌ గడువును ఏటా పొడిగిస్తున్నట్లు  కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు

Published : 03 Dec 2021 05:46 IST

ఈనాడు, దిల్లీ: కృష్ణా ట్రైబ్యునల్‌ గడువును ఏటా పొడిగిస్తున్నట్లు  కేంద్ర జల్‌శక్తిశాఖ సహాయమంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి గురువారం లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. 2004 ఏప్రిల్‌లో ఏర్పాటైన ట్రైబ్యునల్‌ 2010 డిసెంబరు 30న తుది నివేదిక అందించిందన్నారు. తర్వాత దాఖలైన దరఖాస్తులపై 2013 నవంబరు 29న మరో నివేదిక ఇచ్చిందన్నారు. అయితే తదుపరి ఉత్తర్వులు జారీచేసేంతవరకు ట్రైబ్యునల్‌ తీర్పును అఫీషియల్‌ గెజిట్‌లో నోటిఫై చేయకూడదని 2011 సెప్టెంబరు 16న సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీచేసినట్లు చెప్పారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉందని పేర్కొన్నారు. విభజన చట్టంలోని నిబంధనలను అనుసరించి ట్రైబ్యునల్‌ పదవీకాలాన్ని 2014 ఆగస్టు 1 నుంచి రెండేళ్లపాటు పొడిగించినట్లు వెల్లడించారు. తర్వాత ఏడాది చొప్పున ఆరుసార్లు పొడిగించినట్లు తెలిపారు. తాజాగా ఈ ఏడాది ఆగస్టు 1న ఏడాదిపాటు పొడిగించినట్లు వెల్లడించారు.

అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు అనుమతుల మంజూరు
కర్ణాటకలో నిర్మిస్తున్న అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు అన్ని అనుమతులూ మంజూరుచేసినట్లు మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు తెలిపారు. తెరాస సభ్యులు వెంకటేశ్‌ నేత, కవిత మాలోతు, దయాకర్‌, జి.రంజిత్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జల్‌శక్తిశాఖ ఈ ప్రాజెక్టుకు రూ.16,125.48 కోట్ల అంచనా వ్యయానికి ఆమోదం తెలిపిందన్నారు.

తెలుగు రాష్ట్రాల్లో కలుషిత నీటి శాతాన్ని తగ్గిస్తున్నాం  
తెలంగాణలో గత ఆరేళ్లలో 15,19,947 తాగు నీటి నమూనాలు పరీక్షించగా, అందులో 1,66,014 (10.92%) కలుషితమైనట్లు తేలిందని కాంగ్రెస్‌ ఎంపీ ఎ.రేవంత్‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర సహాయమంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌  సమాధానమిచ్చారు. ఏపీలో 20,94,131  నమూనాలను పరీక్షించగా 3,03,049 (14.47%) నమూనాలు కలుషితమై ఉన్నట్లు తేలిందన్నారు. రెండురాష్ట్రాల్లోనూ యేటా కలుషిత నీటి శాతాలు తగ్గుతూ వస్తున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని