పేచీ అసలుపై కాదు.. వడ్డీపైనే!

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య నెలకొన్న విద్యుత్తు బకాయిల వివాదంలో అసలుపై ఎలాంటి పేచీ లేదని, వడ్డీపైనే తకరారు నడుస్తోందని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు. ఆయన గురువారం

Published : 03 Dec 2021 05:46 IST

ఏపీ, తెలంగాణల మధ్య విద్యుత్తు బకాయిలపై కేంద్రం వెల్లడి

ఈనాడు, దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల మధ్య నెలకొన్న విద్యుత్తు బకాయిల వివాదంలో అసలుపై ఎలాంటి పేచీ లేదని, వడ్డీపైనే తకరారు నడుస్తోందని కేంద్ర విద్యుత్తుశాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు. ఆయన గురువారం లోక్‌సభలో వైకాపా ఎంపీ అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. ‘తెలంగాణ ప్రభుత్వం రూ.6,111.88 కోట్ల విద్యుత్తు బకాయిలు ఉన్నట్లు ఏపీ సీఎం ఈ ఏడాది జులై 14న మాకు రాసిన లేఖలో ప్రస్తావించారు. దీనిపై రెండు రాష్ట్రాల ప్రభుత్వాధికారులతో ఒక సమావేశం జరిగింది. అందులో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. వాటిలో 1. ఇది రాష్ట్ర విభజన అనంతర అంశం. 2. ఏపీ, తెలంగాణల మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం విద్యుత్తు సరఫరా జరిగింది. 3. ఏపీ నుంచి తీసుకున్న విద్యుత్తుకు ప్రాథమికంగా తెలంగాణ బిల్లులు చెల్లించింది. 4. ఏపీ.. తెలంగాణకు సరఫరా చేసిన విద్యుత్తుకు సంబంధించి చెల్లించాల్సిన అసలు మొత్తంపై ఎలాంటి వివాదం లేదు. అయితే ఏపీ, తెలంగాణలు చెల్లించాల్సిన అసలుపై వడ్డీని కొంత సవరించాల్సి ఉంది. విద్యుత్తు కొనుగోలు ఒప్పందంలోని షరతులను అనుసరించి ఆ అంకెలను సవరించడానికి ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. 5. తెలంగాణ నుంచి బకాయిలు వసూలు కాకపోవడంతో తెలంగాణ హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కేసు దాఖలు చేసింది. ఇప్పుడది కోర్టు పరిధిలో ఉంది. ద్వైపాక్షిక ఒప్పందాన్ని అనుసరించి విద్యుత్తు సరఫరా చేసినందున, సామరస్యంగా చర్చించుకొని సమస్య పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాలకు కేంద్రం సూచించింది’ అని ఆర్‌కే సింగ్‌ తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు