తామర పురుగుకు వేపనూనెతో చెక్‌

రాష్ట్రంలోని మిరప తోటలకు కొత్తగా తామర పురుగు సోకి అధిక మొత్తంలో నష్టం జరుగుతోందని, రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించి పంటను కాపాడుకోవాలని సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా

Published : 03 Dec 2021 05:46 IST

ములుగు ఉద్యాన విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు

ములుగు, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని మిరప తోటలకు కొత్తగా తామర పురుగు సోకి అధిక మొత్తంలో నష్టం జరుగుతోందని, రైతులు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించి పంటను కాపాడుకోవాలని సిద్దిపేట జిల్లా ములుగులోని కొండా లక్ష్మణ్‌ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు, డా.రాజ్‌కుమార్‌, విస్తరణ సంచాలకులు డా.కిరణ్‌కుమార్‌ స్పష్టం చేశారు. గురువారం ఉద్యాన విశ్వవిద్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మునుపెన్నడూ లేని విధంగా మిరప తోటలకు తెల్లదోమ, ఎర్రనల్లికి తోడుగా తామర పురుగు వ్యాప్తి చెందుతోందన్నారు. చెట్టు ఆకులు రాలిపోయి పదిరోజుల్లో ఎండిపోతుందని తెలిపారు. తామర పురుగులు మిరప చెట్ల పూతలోపల నివాసం ఏర్పరుచుకుని ఒక్కో పురుగు సుమారు 150 వరకు గుడ్లు పెడుతుందన్నారు. అవి కేవలం రెండు రోజుల్లోనే పురుగులుగా మారి తోటను మొత్తం తినేస్తాయన్నారు. ఈ పరిస్థితి  ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా ఉందన్నారు. క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు భారత ఉద్యాన పరిశోధన సంస్థ బెంగళూరుకు చెందిన శాస్త్రవేత్తల ఆధ్వర్యంలో తాము జిల్లాల్లో మిరప తోటలను పరిశీలించామన్నారు. ఆ పురుగులను సేకరించి వాటిపై పరిశోధనలకు బెంగళూరులోని పరిశోధన కేంద్రానికి పంపించామన్నారు. అప్పటివరకు మిరప రైతులు తామర పురుగు బారినుంచి కాపాడుకునేందుకు తోటల్లో జిగురు అట్టలు ఏర్పాటు చేయాలన్నారు. వాటితోపాటు వేపనూనెలో క్లోరోపైరిపాస్‌ కలిపి చెట్లపై పిచికారి చేయాలన్నారు.  

ఐదు రాష్ట్రాల్లో తామరపురుగు ఉద్ధృతి
ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: కొత్త రకం తామర పురుగు ఇప్పుడు దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఉద్ధృతంగా ఉన్నట్లు బెంగళూరు శాస్త్రవేత్తలు గుర్తించారు. తెలంగాణ, ఏపీలతో పాటు కేరళ, కర్ణాటక, తమిళనాడు మిరపతోటల్లో ఈ పురుగు ఆశించినట్లు చెబుతున్నారు. ఒక్కో రాష్ట్రం నుంచి 70-80 నమూనాలు సేకరించి బెంగళూరులోని పరిశోధన కేంద్రం ప్రయోగశాలకు పంపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని