న్యాయాధికారుల అరెస్టులో ‘సుప్రీం’ మార్గదర్శకాలను పాటించాల్సిందే

న్యాయాధికారుల అరెస్ట్‌ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు పాటించాల్సిందేనని ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)కి, హైకోర్టుకు సమాచారం ఇవ్వాల్సిందేనని స్పష్టం

Published : 03 Dec 2021 05:46 IST

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

ఈనాడు, అమరావతి: న్యాయాధికారుల అరెస్ట్‌ విషయంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు పాటించాల్సిందేనని ఏపీ హైకోర్టు తేల్చిచెప్పింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే)కి, హైకోర్టుకు సమాచారం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన మార్గదర్శకాలతో జిల్లా ఎస్పీలకు సర్క్యులర్‌ జారీ చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాటిని ఉల్లంఘిస్తే తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించింది. జడ్జి రామకృష్ణ అరెస్ట్‌ విషయంలో సుమోటోగా నమోదు చేసిన వ్యాజ్యంపై విచారణను మూసివేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్ర, జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం గురువారం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని నమోదైన కేసులో అరెస్టై చిత్తూరు జిల్లా జైల్లో ఉన్న తన తండ్రి ప్రాణాలకు ముప్పు ఉందంటూ జడ్జి ఎస్‌.రామకృష్ణ తనయుడు వంశీకృష్ణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. దాన్ని సుమోటోగా పరిగణించిన హైకోర్టు..  వివరణ ఇవ్వాలని పోలీసులను ఆదేశించింది. అమికస్‌ క్యూరీగా నియమితులైన సీనియర్‌ న్యాయవాది ఎ.సత్యప్రసాద్‌ వాదనలు వినిపిస్తూ.. సస్పెన్షన్లో ఉన్నారనే కారణంతో జడ్జి రామకృష్ణ అరెస్ట్‌ వ్యవహారంలో సుప్రీం మార్గదర్శకాలను పోలీసులు పాటించలేదన్నారు. న్యాయాధికారిగా ఉంటూ ఆ తరహా వ్యాఖ్యలు ఎలా చేస్తారని జడ్జి రామకృష్ణను ఉద్దేశించి ధర్మాసనం ప్రశ్నించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని