ఉత్తమ పర్యాటక పురస్కారం అందుకున్న పోచంపల్లి

భూదానోద్యమానికి పునాది.. పోచంపల్లి పట్టుచీరలకు పుట్టినిల్లైన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి ప్రపంచ అత్యుత్తమ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ....

Published : 03 Dec 2021 05:45 IST

మాడ్రిడ్‌లో స్వీకరించిన భారతదేశ రాయబారులు

భూదాన్‌పోచంపల్లి- న్యూస్‌టుడే, ఈనాడు, హైదరాబాద్‌: భూదానోద్యమానికి పునాది.. పోచంపల్లి పట్టుచీరలకు పుట్టినిల్లైన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి ప్రపంచ అత్యుత్తమ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ స్థాయిలో విజేతగా నిలిచింది. ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ(యూఎన్‌డబ్ల్యూటీఓ) నుంచి ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకుంది. స్పెయిన్‌ రాజధాని మాడ్రిడ్‌లో భారత కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం జరిగిన కార్యక్రమంలో- భారత రాయబార కార్యాలయ రెండో కార్యదర్శి సుమన్‌ శేఖర్‌ యూఎన్‌డబ్ల్యూటీఓ అధికారుల నుంచి ఈ పురస్కారాన్ని స్వీకరించారు. ఈ సంస్థ ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’ పోటీలు నిర్వహించగా.. దేశంలోని మరో రెండు గ్రామాలతో పోటీపడి పోచంపల్లి విజేతగా నిలిచింది.

ఎంపిక గర్వకారణం: శ్రీనివాస్‌గౌడ్‌
ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుంచి 170 ప్రతిపాదనలు ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థకు వెళ్లగా మనదేశం నుంచి భూదాన్‌ పోచంపల్లి ఎంపికవ్వడం గర్వకారణమని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. అవార్డు స్వీకరణ ప్రదానం కార్యక్రమానికి ఆయన వర్చువల్‌గా హాజరై వీక్షించారు. పోచంపల్లిలోని ప్రాచీన చేనేత వారసత్వాన్ని పునరుద్ధరించి గ్రామాన్ని క్రాఫ్ట్‌ విలేజ్‌గా ప్రపంచ గుర్తింపు రావడానికి సీఎం కేసీఆర్‌ కీలకపాత్ర పోషించారని చెప్పారు. వచ్చే ఏడాది కూడా ఐరాస ప్రపంచ పర్యాటక సంస్థ గుర్తింపు రాష్ట్రానికి రావడానికి ప్రణాళికలు తయారుచేయాలని అధికారుల్ని మంత్రి ఆదేశించారు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ నిరంతర కృషి వల్లనే పోచంపల్లికి అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని