
చెన్నైకి తాగునీటి సరఫరాపై త్వరలో సమావేశం
10లోపు సూచనలు పంపాలని సభ్య రాష్ట్రాలకు కృష్ణా బోర్డు సూచన
ఈనాడు, హైదరాబాద్: చెన్నై నగరానికి తాగునీటి సరఫరా చేయడంపై త్వరలో సభ్య రాష్ట్రాలతో సమావేశం నిర్వహించనున్నట్లు కృష్ణానది యాజమాన్య బోర్డు తెలిపింది. ఈ నెల పదో తేదీ లోపు సభ్యులు సూచనలు పంపాలని సూచించింది. ఈ ఏడాది జనవరి 19న నిర్వహించిన అయిదో సమావేశంలో చేసిన తీర్మానాల ఆమోదంతో పాటు పలు అంశాలపై సమావేశంలో చర్చించనున్నట్లు పేర్కొంది. ఈ మేరకు బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. సభ్యులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణతోపాటు కేంద్ర జలసంఘానికి లేఖ రాశారు. మరోవైపు జులై- అక్టోబరుల మధ్య ఎపీ-తమిళనాడు సరిహద్దుల వరకు 8 టీఎంసీల నీటిని అందించాల్సి ఉండగా 23.10.2021 వరకు 5.08 టీఎంసీలే చేరడం, మిగులు నీటిని అందించేలా చర్యలు, కృష్ణా జలాల వినియోగ సమాచారం పరస్పరం బదిలీ, శ్రీశైలం నుంచి నీటి తరలింపునకు పైపులైను ఏర్పాటు ప్రతిపాదన, ఏపీ-తమిళనాడు మధ్య రియల్‌టైమ్ డేటా నిర్వహణ తదితర అంశాలు సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయని బోర్డు పేర్కొంది.